Tamil Nadu education at doorsteps: గూగుల్ రూపొందించిన రీడ్ అలాంగ్ యాప్ సాయంతో తమిళనాడు విద్యార్థులు రికార్డు సృష్టించారు. 18.36 లక్షల మంది విద్యార్థులు 12 రోజుల వ్యవధిలో 263 కోట్ల పదాలను చదివి ఈ ఘనత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్లం తేడి కల్వి(ఇంట్లోనే విద్య) అనే పథకంలో భాగంగా విద్యార్థుల్లో పఠన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు జూన్ 1నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ, గూగుల్ రీడ్ అలాంగ్ యాప్ సమన్వయంతో భారీ స్థాయిలో దీన్ని నిర్వహించారు.
Tamil Nadu reading marathon: 'రీడింగ్ మారథాన్' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా.. గూగుల్ యాప్ను ఉపయోగించి విద్యార్థుల ద్వారా కథలు చదివించారు అధికారులు. ఆంగ్లం, తమిళ భాషల్లో విద్యార్థులు చదువుకునే సౌలభ్యం ఈ యాప్లో ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థుల వయసును బట్టి.. పదాల సంఖ్యలో తేడా ఉంటుందని వెల్లడించారు.
ఈ డిజిటల్ కార్యక్రమంలో భాగంగా 1.8 లక్షల ఇళ్లం తేడి కల్వి సెంటర్లను తమిళనాడు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. జూన్ 1 నుంచి 12 మధ్య 18.36 లక్షల మంది విద్యార్థులు ఇందులో పాలు పంచుకున్నారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రొఫైల్ను వలంటీర్లు క్రియేట్ చేశారు. మొత్తంగా శనివారం నాటికి ఈ యాప్లో 263 కోట్ల పదాలను విద్యార్థులు చదివేశారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే తిరుచినాపల్లికి చెందిన విద్యార్థులు అత్యధికంగా 62.82 లక్షల పదాలు చదివారు. మధురైలోని అలంగనల్లూర్ 49.19 లక్షల పదాలతో రెండో స్థానంలో ఉంది. మధురై జిల్లాలోని మేలూర్ ప్రాంత విద్యార్థులు 41.72 లక్షల పదాలు చదివి మూడోస్థానంలో నిలిచారు.
పిల్లలు సరదాగా చదువుకునేలా రీడ్ అలాంగ్ యాప్ను గూగుల్ రూపొందించింది. పిల్లలు పలికే పదాలను ఇది గుర్తించి.. మరిన్ని పదాలు నేర్చుకునేలా సాయం చేస్తుంది. సరైన పదాలు చెప్పినప్పుడు ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు తమిళనాడు సర్కారు.. గూగుల్ యాప్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టింది.
ఇదీ చదవండి: