Medical Student Sirisha Brutal Murder in Vikarabad : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన పారా మెడికల్ విద్యార్థిని శిరీష హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో శిరీష బావ అనిల్ ప్రమేయం ఉందని అనుమానిస్తున్న పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శిరీష హత్యను ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య, యాదమ్మ దంపతులు. వారికి నలుగురు పిల్లలు. జంగయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జంగయ్య కుమార్తె శిరీష ఇంటర్ పూర్తి చేసి.. పారా మెడికల్ కోర్స్‌లో చేరింది. తల్లికి అనారోగ్యం కారణంగా ఆమె చదువు మధ్యలోనే ఆపేసింది.
Sirisha Murder Case in Vikarabad : ఈ క్రమంలో ఈనెల 10వ తేదీన ఇంటి నుంచి రాత్రి 10 గంటల సమయంలో బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తండ్రి ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం కాడ్లాపూర్ శివారులోని ఓ కుంటలో గుర్తు తెలియని శవం కనిపించింది. గమనించిన స్థానికులు శిరీషనే హత్యకు గురైనట్లు గుర్తించారు. ఓ కన్ను పీకేసి.. కాళ్లు, చేతులను కత్తులతో కోసి, పాశవికంగా యువతిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నీటి కుంటలో పడేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నీటి కుంట వద్ద ఆధారాలు సేకరించారు.
"మా కుమార్తె రాత్రి ఇంటి నుంచి వెళ్లింది. ఆ తరువాత తిరిగి ఇంటికి రాలేదు. తెలిసిన వారు, బంధువులను అడిగాం. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఇంతలో మా ఊరు చివర ఉన్న చిన్న కుంటలో శవమై కనిపించింది. శవంపై కళ్లు పొడిచి ఉన్నాయి. మెడ, శరీరంపై కత్తి గాట్లు ఉన్నాయి". - జగ్గయ్య, శిరీష తండ్రి
Medical Student Sirisha Murder in Parigi : శరీర భాగాలను కోసినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శిరీష ఫోన్‌కాల్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. చివరగా ఆమెతో ఫోన్‌లో మాట్లాడిందెవరు..? ఇంట్లోనే ఏమైనా గొడవలు జరిగాయా? అనే కోణంలో పోలీసులు ఆధారాల కోసం సేకరిస్తున్నారు.
Nursing Student Sirisha Murder Case update : ఆమెను ఎందుకింత దారుణంగా హత్య చేశారు. వేరే ప్రాంతంలో హత్య చేసి నీటి కుంటలో మృతదేహం పడేశారా.. రాత్రి 10 గంటల సమయంలో ఎక్కడికి వెళ్లిందనే కోణాల్లో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే శిరీషను ఆమె బావ అనిల్ కొట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయంపై ప్రస్తుతం దృష్టి సారించారు.
ఈ కేసులో ప్రధానంగా శిరీష కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తమవుతోంది. ఆమె తండ్రి జంగయ్య, అక్క భర్త అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బావపై అనుమానం బలపడటంతో, లోతుగా విచారిస్తున్నామని డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి తెలిపారు. శిరీష ఫోన్‌లో లభ్యమయ్యే సమాచారంతో దర్యాప్తులో పురోగతి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
"కాడ్లాపూర్ శివారులోని ఓ నీటి కుంటలో యువతి మృతదేహం దొరికినట్లు మాకు సమాచారం వచ్చింది. ఆ మృతదేహం కాడ్లాపూర్‌కు చెందిన యువతి శిరీషగా గుర్తించాం. గ్రామస్థుల సహకారంతో యువతి మృతదేహాన్ని బయటకు తీశాం. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. శిరీష వయుస్సు 19 సంవత్సరాలు ఉంటుంది. ఆమె తండ్రి చెప్పిన దాని ప్రకారం నిన్న రాత్రి ఒంటి గంట సమయంలో యువతి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్నాం. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తాం."- పోలీసులు, వికారాబాద్
ఇవీ చదవండి: