ETV Bharat / bharat

భారత్‌లో తొలి సింగిల్ డోస్​ టీకా అదేనా? - రెడ్డీస్ లాబోరేటరీ

దేశంలో టీకా కొరత ఏర్పడ్డ వేళ.. త్వరలోనే భారత్​లో సింగిల్​ డోస్​ టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. స్పుత్నిక్‌ లైట్‌ పేరుతో రష్యా అభివృద్ధి చేస్తున్న సింగిల్​ డోసు టీకా తుది దశ ప్రయోగ ఫలితాలు ఈ నెల చివరినాటికి వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో జులై నాటికి స్పుత్నిక్‌ లైట్‌ టీకానే భారత్‌లో తొలుత అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

sputnik  v vaccine lite
స్పుత్నిక్ వీ లైట్ వ్యాక్సిన్​
author img

By

Published : May 14, 2021, 10:13 PM IST

కరోనా వ్యాక్సిన్‌ కొరత ఎదుర్కొంటున్న భారత్‌లో.. త్వరలోనే సింగిల్‌ డోసు టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ భారత్‌లో సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు భాగస్వామ్య కంపెనీ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

'గేమ్‌ ఛేంజర్‌'

ఇదే సమయంలో స్పుత్నిక్‌ లైట్‌ పేరుతో వెలువడిన రష్యా వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగ ఫలితాలు ఈ నెల చివరినాటికి వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో జులై నాటికి స్పుత్నిక్‌ లైట్‌ టీకానే భారత్‌లో తొలుత అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు భారత్‌లో స్పుత్నిక్‌ వీ పంపిణీ చేపట్టిన డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వ్యాక్సిన్‌ కొరతతో సతమతమవుతున్న భారత్‌లో సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే కరోనా పోరులో 'గేమ్‌ ఛేంజర్‌'గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆ తర్వాతే అందుబాటులోకి

'స్పుత్నిక్‌ లైట్‌' క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) పరిశీలించి వినియోగానికి అనుమతించిన తర్వాతే దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ సీఈఓ ఎం.వి. రమణ తెలిపారు. రష్యా వ్యాక్సిన్‌కు భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ భాగస్వామిగా ఉండడం వల్ల ఫలితాలు వెలుబడిన వెంటనే భారత్‌లో 'స్పుత్నిక్‌ లైట్‌' అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఒక డోసు రూ.995

మే 14న హైదరాబాద్‌లో వీటి పంపిణీ ప్రారంభించిన డాక్టర్‌ రెడ్డీస్‌, టీకా ఒక డోసు ధరను రూ.995గా నిర్ణయించింది. ప్రస్తుతం ఇవి దిగుమతి చేసుకున్నవి కాగా..భారత్‌లో తయారీ ప్రారంభమైన తర్వాత (జులై) వీటి ధర తగ్గే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.

'స్పుత్నిక్‌ లైట్‌'కు 80శాతం సామర్థ్యం!

రెండు డోసుల 'స్పుత్నిక్‌ వి' వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆర్‌డీఐఎఫ్‌, ఒకే డోసు 'స్పుత్నిక్‌ లైట్‌' వ్యాక్సిన్‌ను రూపొందించింది. దీనికి ఇప్పటికే రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. కొవిడ్‌-19ను అదుపు చేయడంలో ఒకే డోసు వ్యాక్సిన్‌ 79.4% ప్రభావశీలత కనబరిచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. రష్యా, యూఏఈ, ఘనా, మరికొన్ని దేశాల్లో 7వేల మందిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయని ఆర్‌డీఐఎఫ్‌ ఈ మధ్యే వెల్లడించింది. ఈ పరీక్షల మధ్యంతర సమాచారం ఈ నెలాఖరు నాటికి వెల్లడవుతాయని అంచనా.

ఒకే డోసు మేలు

వివిధ దేశాల్లో కొవిడ్‌-19 తీవ్రత దృష్ట్యా ప్రజలకు తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందని, దీనికి ఒకే డోసు వ్యాక్సిన్‌ మంచి పరిష్కారమని ఆర్‌డీఐఎఫ్‌ చీఫ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ పేర్కొన్నారు. అదే సమయంలో రెండు డోసుల 'స్పుత్నిక్‌ వి' టీకాను కొనసాగిస్తామన్నారు.

ఈ నేపథ్యంలో ఒకవేళ భారత ఔషధ నియంత్రణ సంస్థలు వీటి ఫలితాలపై సంతృప్తి చెందితే త్వరలోనే సింగిల్‌ డోస్‌ అందుబాటులోకి వస్తుందని నిపుణుల అంచనా.

ఇదీ చదవండి : ఇంటినే కొవిడ్ కేంద్రంగా మార్చిన మంత్రి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.