Sikkim Flood 2023 : ఆకస్మిక వరదలు సిక్కింలో బీభత్సం సృష్టించాయి. నాలుగు జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా పడింది. 22మంది జవాన్లు సహా 102మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు పాక్యోంగ్ జిల్లాలో ఏడుగురు, మంగన్‌లో నలుగురు, గ్యాంగ్‌టక్‌లో ముగ్గురు చనిపోయారు. మరో 26మంది గాయపడ్డారు. గల్లంతైన 102 మందిలో పాక్యోంగ్ జిల్లాలోనే 22మంది సైనికులు సహా 59 మంది, గ్యాంగ్‌టక్‌లో 22 మంది, మంగన్‌లో 16 మంది, ఐదుగురు నామ్‌చీ జిల్లాకు చెందినవారు.
ఉత్తర సిక్కింలోని లోనక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. తీస్తా నది బేసిన్ పరివాహ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. 22వేల మందిపై వరదలు ప్రభావం చూపగా.. 2వేల మందిని సహాయక బృందాలు కాపాడినట్లు సిక్కిం విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వరదల్లో గల్లంతైన 22 మంది సైనికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. నదీ ప్రవాహ ఉద్ధృతి కారణంగా దిగువ ప్రాంతాలకు కొట్టుకుపోయే అవకాశం ఉండటం వల్ల లోతట్టు ప్రాంతాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. వరద ప్రభావం ఉన్న 4 జిల్లాల్లో 26 పునరావాస క్యాంపులు ఏర్పాటు చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
సిక్కింలోని మంగన్ జిల్లాలో 10వేలమంది, పాక్యోంగ్‌లో 6,895 మంది, నామ్‌చీలో 2579 మంది, గ్యాంగ్‌టక్‌లో 2,570 మందిపై వరదల ప్రభావం పడింది. మూడు జిల్లాల్లో 11వంతెనలు ధ్వంసమయ్యాయి. ఒక్క మంగన్ జిల్లాలోనే 8వంతెనలు కొట్టుకుపోగా.. నామ్‌చీ జిల్లాలో రెండు, గ్యాంగ్‌టక్ జిల్లాలో ఓ వంతెన ధ్వంసమైంది. వరద ప్రభావిత జిల్లాల్లో తాగునీటి పైపు లైన్లు, మురుగు నీటి కాల్వలు, 277 కాంక్రీట్, కాంక్రీట్‌యేతర నివాసాలు దెబ్బతిన్నాయి. చుంగ్‌తాంగ్ పట్టణంలోని 80శాతం తీవ్రంగా వరద ప్రభావానికి గురైంది. సిక్కిం రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పదో నెంబరు జాతీయ రహదారి చాలా ప్రాంతాల్లో ధ్వంసమైంది.
ఆకస్మిక వరదలతో తీవ్ర ప్రభావానికి గురైన సింగ్‌తామ్ ప్రాంతాన్ని సిక్కిం సీఎం తమాంగ్ సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన ఆయన సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల వారికి పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. వరదల్లో చిక్కుకుపోయిన పర్యటకులతో సిక్కిం పర్యటక శాఖ అధికారులు టచ్‌లో ఉన్నట్లు సిక్కిం విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. చుంగ్‌తాంగ్ ప్రాంతంలో వరద నీటి మట్టాలు పెరుగుతున్నట్లు స్థానిక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Sikkim Flood : వరద బీభత్సానికి 14 మంది మృతి.. 102 మంది గల్లంతు.. ముమ్మరంగా గాలింపు చర్యలు