జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్కౌంటర్ ప్రాంగణంలోకి చిన్నపిల్లాడిని తీసుకెళ్లడం ఏంటని? పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
ఏం జరిగింది ?
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముష్కరులను లొంగిపోమని.. వారి బంధువులతో చెప్పించారు. ఈ క్రమంలో ఉగ్రవాది అహ్మద్ మాలిక్ ను లొంగిపోమని అతడి భార్య, మూడేళ్ల కుమారుడు ప్రాధేయపడ్డారు. కానీ మాలిక్ మనసు మారలేదు. చివరకు పోలీసులు కాల్పుల్లో మాలిక్ మృతి చెందాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
బాలుడు అక్కడికి ఎందుకు?
అయితే ఎన్కౌంటర్ ప్రాంగణంలోకి చిన్నపిల్లల్ని ఎలా తీసుకెళ్తారంటూ వీడియో చూసిన నెటిజన్లు.. పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ చర్య వల్ల బాలుడు మానసికంగా బాధపడతాడని సీనియర్ జర్నలిస్ట్ అమన్ సింగ్ చిన్నా ట్వీట్ చేశారు. మరో సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ చౌహాన్ మాట్లాడుతూ.. 'మిలిటరీ కోణంలో చూస్తే పోలీసులు.. తమ పనిని శాంతియుతంగా పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలైనా చేపట్టవచ్చు. కానీ మానవతా దృక్పథంతో చూస్తే మాత్రం.. బాలుడిని ఇలాంటి ఆపరేషన్లకు తీసుకెళ్లవద్దు' అన్నారు.
పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు.
ఇదీ చదవండి: 'సీఏఏ, భాజపాను ఓడించాలనేదే ప్రజల కోరిక'