కర్ణాటక మంగుళూరులో రెండేళ్ల బాలికను లైంగిక వేధింపులకు (Sexual Harassment) గురి చేశాడు బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి. అంతేగాకుండా ఆ చిన్నారిని చంపేందుకు ప్రయత్నించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు చందన్‌ను అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
కర్ణాటక మంగుళూరులోని హోయిగే బజార్లో ఉండే ఫిష్ కటింగ్ యార్డ్‌లో బిహార్‌కు చెందిన సుమారు 75 మంది పని చేస్తూ ఉంటారు. వీరిలో ఒకడైన చందన్.. అక్కడే ఉండే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు బాలిక కోసం గాలించారు. సుమారు 9 గంటల వెతుకులాట అనంతరం స్థానికంగా ఉండే ఉప్పునీటి మడిలో చిన్నారిని గుర్తించారు.
అప్పటికే బాలిక మృతి చెందిందని భావించిన కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బాలిక వేధింపులకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిందితుడు చందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. లైంగిక వేధింపులకు గురి చేసిన అనంతరం... నిందితుడు బాలికను పక్కన ఉన్న ఉప్పు నీటి మడిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: 'ధరలు పెరిగితే ఏంటి?.. ప్రజలు బాగానే సంపాదిస్తున్నారు కదా!'