భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయమూర్తులు సహా ప్రముఖులపై చైనా నిఘా వేసి ఉంచుతోందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్ విచారణ తేదీని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరిలో దీనిపై వాదనలు విననున్నట్లు తెలిపింది. 'క్రిస్మస్, కొత్త సంవత్సర సెలవుల తర్వాత ఈ కేసును తమ దృష్టికి తీసుకురావాల'ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.
ఇదీ చదవండి: చైనా మరో కుట్ర- ప్రముఖులపై నిఘా!
'సేవ్ దెమ్ ఇండియా ఫౌండేషన్' అనే ఎన్జీఓ ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. సైబర్ ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, ఐటీ చట్టం, ఐపీసీ ప్రకారం దీనిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించింది. దీంతోపాటు చైనా కేంద్రంగా పనిచేసే డిజిటల్ లోన్ యాప్‌లను భారత్‌లో నిషేధించాలని కోరింది. విరుద్ధ పద్ధతులు పాటిస్తున్న ఎన్బీఎఫ్సీలు, లోన్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
"మనీ లెండింగ్ యాప్‌లతో పాటు చాలా మార్గాల్లో భారతీయుల సమాచారాన్ని చైనా కొల్లగొడుతోంది. భవిష్యత్తులో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దేశ భద్రత, సమగ్రతకు విఘాతం కలిగిస్తుంది. దేశ రాష్ట్రపతి, ప్రధాని, వేలాది మంది అధికారుల రహస్యాలు, పౌరుల గోప్యతతో చైనా ఆటలాడుతోంది."
-సేవ్ దెమ్ ఇండియా పిటిషన్
దేశంపై చైనా గూఢచర్యం చేయడం వల్ల విలువైన సమాచారం కోల్పోతామేమోనని ఆందోళన వ్యక్తం చేసింది సేవ్‌దెమ్ ఇండియా.
ఇదీచదవండి: 'మోదీజీ... మనపై చైనా నిఘా సంగతేంటి?'