రాజకీయ పార్టీలు నిధులు సేకరించడానికి ఉద్దేశించిన ఎన్నికల బాండ్లు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు బుధవారం అనుమానం వ్యక్తం చేసింది. కొన్ని పార్టీలు వీటిని ఉగ్రవాదం, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మళ్లించే అవకాశం ఉందని తెలిపింది. బాండ్ల ద్వారా వచ్చే సొమ్మును ఏ విధంగా వినియోగిస్తున్నారో తెలుసుకోవడానికి నియంత్రణ ఏమైనా ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
బాండ్ల విషయమై ఇదివరకే దాఖలైన దావాలు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతం పార్టీలు బాండ్లు విక్రయించకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే, జస్టిస్ ఏ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామ సుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. నిధుల వినియోగంపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సి ఉందంటూ అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్‌కు తెలిపింది. ఇందుకు వేణుగోపాల్ సమాధానం చెబుతూ ఎన్నికల బాండ్ల కాల పరిమితి 15 రోజులు మాత్రమేనని, ఆ తరవాత పార్టీలు ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. బాండ్లు కొనుగోలు చేసేవారు చట్టబద్దమైన ధనంతోనే వీటిని కొనుగోలు చేస్తారా అని ధర్మాసనం మళ్లీ ప్రశ్నించింది. అన్ని పన్నులు చెల్లించేవారే వీటిని కొనుగోలు చేస్తారని అటార్నీ జనరల్ సమాధానమిచ్చారు. వ్యవహారమంతా బ్యాంకుల ద్వారా నడుస్తుందని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి 10 వరకు కొత్తగా బాండ్లు జారీ చేస్తారని చెప్పారు.
ఇదీ చదవండి: 18 రాష్ట్రాలకు పాకిన 'కొత్త రకం' కరోనా