SC on father assets: వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి ఆస్తులపై కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తండ్రి స్వయంగా సంపాదించిన, ఆస్తుల విభజన ద్వారా పొందినవాటిపై కుటుంబంలోని దాయాదుల కంటే కుమార్తెలకే ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలుపై ధర్మాసనం విచారించింది.
చనిపోయిన హిందూ పురుష వ్యక్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. తండ్రి మరణించాక ఆస్తులు ఆయన సోదరుడి కుమారుడికి చెందుతాయా, సొంత కుమార్తెకు వారసత్వ హక్కు లేదా అనే అంశాలపై ధర్మాసనం విచారణ జరిపి 51 పేజీల తీర్పు వెలువరించింది.
"కుమార్తెలకు, వితంతువైన భార్యకు ఉన్న హక్కును పురాతన హిందూ సంప్రదాయ చట్టాలు, వివిధ తీర్పులు స్పష్టంగా గుర్తించాయి. అయితే- ఒక హిందూ మహిళ ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే మాత్రం ఆమెకు తన తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా సంక్రమించిన ఆస్తిపాస్తులు ఆమె తండ్రి వారసులకు చెందుతాయి. ఆమెకు భర్త ద్వారా, లేదా మామగారి ద్వారా లభించిన ఆస్తులు భర్త వారసులకు దక్కుతాయి" అని విశదీకరించింది.
1994లో దిగువ న్యాయస్థానం, 2009లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!