నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే లక్ష్యంగా మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, ఎన్సీబీ నేత నవాబ్ మాలిక్ (Nawab Malik Sameer Wankhede).. సామాజిక మాధ్యమాల్లో మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. వాంఖడే మొదటి వివాహానికి సంబంధించిన ఫొటో, 'నిఖా నామా' స్క్రీన్షాట్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
వాంఖడే మోసపూరితంగా కుల ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించి.. ఉద్యోగం పొందారని మాలిక్ (Nawab Malik news) ఆరోపించారు. తాను ట్విట్టర్లో పోస్ట్ చేసిన 'నిఖా నామా', జనన ధ్రువీకరణ పత్రాలు తప్పని తేలితే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. సమీర్ వాంఖడే (NCB Sameer Wankhede) రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. చట్టప్రకారమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడని వ్యాఖ్యానించారు.
"ఎలక్ట్రానిక్ పరికరాల ఆధారంగా.. విచారణ జరుపుతామని ఎన్సీబీ ఎప్పుడూ చెబుతుంటుంది. సమీర్ వాంఖడే, ప్రభాకర్ సెయిల్, కిరణ్ గోసావి, వాంఖడే డ్రైవర్ మానె ఫోన్ కాల్ వివరాలను పరిశీలించాలని విజిలెన్స్ కమిటీని డిమాండ్ చేస్తున్నా. ఎలక్ట్రానిక్ పరికరాల దర్యాప్తు జరిగితే అంతా స్పష్టంగా తెలుస్తుంది. సమీర్ వాంఖడే (NCB officer Sameer Wankhede) మతం గురించి నేను మాట్లాడటం లేదు. కానీ, తప్పుడు పద్ధతిలో కుల సర్టిఫికెట్‌ను సంపాధించి.. ఐఆర్ఎస్ ఉద్యోగంలోకి చేరారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థి భవిష్యత్‌ను నాశనం చేశారు."
-నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి
వాంఖడేపై ఇదివరకూ పలు ఆరోపణలు చేశారు మాలిక్. తప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగం సంపాదించారని ట్వీట్లు చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసి, వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసేవారని ఓ లేఖను విడుదల చేశారు. అయితే, వీటిని వాంఖడే ఖండించారు. ఆరోపణలపై విచారణకు సిద్ధమేనని తెలిపారు. వీటిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని అన్నారు.
ముంబయి క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసును సమీర్ వాంఖడే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: