Revanth Reddy, Telangana Election Result 2023 Live : ఇక నుంచి ప్రగతి భవన్ - అంబేడ్కర్ ప్రజా భవన్‌గా మారనుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే విధంగా తీర్పును ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే చర్యలకు అన్ని పార్టీలు కలిసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని.. కాంగ్రెస్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
Revanth Reddy On Congress Victory in Telangana 2023 : 2009 డిసెంబరు 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ డిసెంబరు 3న తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌కు అవకాశం వచ్చిందన్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో 21 రోజులు సాగిందని, ఈ యాత్ర ద్వారా రాహుల్ తమలో స్ఫూర్తిని నిలిపారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాహుల్, సోనియా, ప్రియాంకలకు తెలంగాణతో కుటుంబ అనుబంధం ఉందని చెప్పారు. తనను, భట్టి విక్రమార్కను రాహుల్‌గాంధీ వెన్నుతట్టి ప్రోత్సహించారని వెల్లడించారు.
'కాంగ్రెస్ పార్టీ విజయం పార్టీలోని సీనియర్ల సహకారంతోనే సాధ్యమైంది. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం. మానవహక్కులను కాపాడుతాం. కాంగ్రెస్ గెలుపును కేటీఆర్ స్వాగతించారు. కేటీఆర్ స్పందనను స్వాగతిస్తున్నాము. విపక్షాలు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని' టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
"పరిపాలన ఇక నుంచి గతంలోలా ఉండదు. సామాన్యులకు కూడా సచివాలయ గేట్లు తెరుచుకుంటాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నాను. నాలుగు కోట్ల మంది ప్రజల తీర్పునకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రగతిభవన్ పేరును అంబేడ్కర్ భవన్‌గా మారుతుంది. ఇకనుంచి ప్రగతి భవన్‌ను ప్రజా భవన్ అవుతుంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాను. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు నెరవేరుస్తాం." - రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షుడు
Telangana Election 2023 Result : ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. ప్రొ.కోదండరామ్ సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని, దీనికి బీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే చర్యలకు అన్ని పార్టీలు కలిసిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.