100 Years Old Athlete Sriramulu from Vizag: కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన శ్రీరాములు.. ఉద్యోగ రీత్య విశాఖపట్నంలోని సాగరతీరంలో స్థిరపడ్డారు.1923లో జన్మించిన ఆయన.. నేటికి వందేళ్లు పూర్తిచేసుకున్నారు. 1944లో రాయల్ ఇండియన్ నేవీలో కొలువు సాధన ద్వారా.. యూనిఫాం సర్వీసులోకి ప్రవేశించిన శ్రీరాములు.. స్వాతంత్య్రానంతరం భారత నౌకాదళంలోకి ప్రవేశించారు.
35 ఏళ్ల సర్వీసు చేసి ఈయన 1975లోనే రిటైర్ అయినా మరో నాలుగేళ్ల పాటు సేవలను పొడిగించారు. నౌకాదళంలో అత్యంత కీలకమైన నేవిగేషన్ విభాగంలో సేవలందించారు. పాకిస్తాన్, చైనా యుద్ధ సమయంలోనూ ఈయన నేవిగేషన్లో సెయిలర్‌గా విధులు నిర్వహించారు. పదవీ విరమణ అనంతరం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎనిమిదేళ్లపాటు పని చేశారు. ఆ తర్వాతనే ఆయన పరుగు పోటీల జీవనం మరింత జోరందుకుంది.
తొలిసారిగా 2010లో ది ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో పరుగు పందెంలో పాల్గొని నాలుగు విభాగాల్లో బంగారు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పారు. 2015లో ఫ్రాన్స్ లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలకు హాజరైన.. పది కిలోమీటర్ల రేస్ వాక్‌లో పసిడి పతకం సాధించారు.
"బతికున్నంతకాలం ఎవరికీ భారం కాకుండా, మందుల జోలికి పోకుండా సంతోషంగా జీవించాలి. నేను నేవీలో ఉన్నప్పుడు సెయిలర్‌ని. ప్రస్తుతం నేను ఒక రోజు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే.. మరొక రోజు వాకింగ్‌కి వెళ్తాను. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి". - శ్రీరాములు
2016లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్స్ పోటీల్లో పాల్గోన్న శ్రీరాములు.. 5,10,15 కిలోమీటర్ల రేస్ వాక్‌లలో మూడు బంగారు పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు. ఆసియా ఖండం నుంచి ఈయన ఒక్కరే మూడింటిలోనూ పతకాలు సాధించి.. అథ్లెట్ ఆఫ్ ఏసియా 2016 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా 81 ఏళ్ల వయసులో 2002లో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాలను తన తనయుడితో కలిసి ఎక్కేశారు. అంతే కాకుండా వచ్చే సంవత్సరం జరిగే ప్రపంచ మారథాన్ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమువుతున్నారు.
శతవసంతాలు పూర్తి చేసుకున్నా.. ఉదయం మూడు గంటలకే శ్రీరాములు దినచర్య మొదలవుతుంది. సముద్ర తీరంలో 10 కిలోమీటర్లకు పైనే నడక సాగుతుంది. పరుగులేని రోజున ఇంటిలోనే వ్యాయామాలు చేస్తారు. తక్కువగా తినడం... ఎక్కువగా కష్టపడటం వల్లే వందేళ్లు పూర్తైనా నేటికీ.. ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు. శ్రీరాములు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.... ఆయన సన్నిహితుడు కేఎం రావు తెలిపారు.
"నేను వాకింగ్ చేస్తున్నప్పుడు.. ఒక రోజు.. నేను చేస్తున్న వాకింగ్ తప్పు అని చెప్పారు. ఎలా చేయాలో నేర్పించారు. ఆ రోజు నుంచి నేను సరిగ్గా వాకింగ్ చేస్తున్నాను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఖగోళశాస్త్రం గురించి కూడా ఆయనకి చాలా విషయాలు తెలుసు. వాటి గురించి కూడా నేను ఆయన నుంచి తెలుసుకున్నాను". - కె.ఎం.రావు, శ్రీరాములు సన్నిహితుడు