RBI Interest Rate Decision : వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచామని తెలిపారు. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత పరిధి అయిన 4 శాతం కంటే ఎక్కువగానే ఉందని చెప్పారు. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ఉదయం ప్రకటించారు. ఎంఎస్‌ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంటాయని చెప్పారు.
గత జూన్ సమావేశంలోనూ రెపో రేటును ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది మూడోసారి. అంతకుముందు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచింది.
RBI Monetary Policy August 2023 : ఆర్‌బీఐ సమీక్షలోని కీలకాంశాలివీ..
- భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెంది.. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
- ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పురోగతిని సాధించింది.
- ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.
- ఈ ఏడాది ఏప్రిల్- మే కాలంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 5.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. గతేడాది ఇదే కాలంలో ఈ ఎఫ్‌డీఐలు 10.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
- గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పుంజున్నాయి. ఖరీఫ్ సీజన్ పంటలతో ఆర్థిక రంగం మరింత ఊపందుకుంటుంది.
- ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును గత అంచనాలను అనుగుణంగా 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించింది.
- టమాటా, పప్పు ధాన్యాలు ధరలు విపరీతంగా పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలను సవరించాం. గతంలో ఈ అంచనాలు 5.1 శాతంగా ఉండగా.. ఇప్పుడు 5.4 శాతానికి పెంచాం.
- ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.2శాతం, మూడో త్రైమాసికంలో 5.7 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతం ఉండనున్నట్లు అంచనా వేసింది.
- రూ.2వేల నోట్ల ఉపసంహరణ, కేంద్రానికి డివిడెండ్‌తో మిగులు ద్రవ్యం పెరిగింది.
- సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి) 4.5 శాతం వద్దే కొనసాగుతంది.
- ఈ ఏడాది జనవరి నుంచి రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతోంది. విదేశీ మారక నిల్వలు 600 బిలియన్ డాలర్లను దాటాయి.
- యూపీఐ లైట్ ద్వారా చెల్లింపుల పరిమితిని రూ. 200 నుంచి రూ.500కు పెంచాం.
బ్యాంకులకు తిరిగొచ్చిన మూడోవంతు రూ.2000నోట్లు.. ఇంకా 3 నెలల గడువు ఉండగానే..