సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న పోరాటానకిి మద్దతు కూడగట్టేందుకు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ మార్చిలో ఐదు రాష్ట్రాల్లో తిరగనున్నారు. మార్చి 1 నుంచి ఆయన పర్యటన మొదలుకానుంది.
"ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో రైతులతో సమావేశాలు నిర్వహిస్తాం. ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా రెండు సమావేశాలు ఏర్పాటు చేస్తాం. రాజస్థాన్‌లో రెండు, మధ్యప్రదేశ్‌లో 3 సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేశాం. మార్చి 20,21, 22న కర్ణాటకలో చివరి సమావేశాలు నిర్వహిస్తాం."
- ధర్మేంద్ర మాలిక్, బీకేయూ మీడియా ఇన్ఛార్జ్
మార్చి 6న తెలంగాణలో ఓ సమావేశాన్ని నిర్వహించేందుకు అనుమతి ఇంకా రాలేదని ధర్మేంద్ర అన్నారు. ఒకవేళ అనుమతి లభిస్తే తెలంగాణలో కూడా ముందస్తు ప్రణాళిక ప్రకారం సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు దిల్లీ సరిహద్దు కేంద్రాలైన టిక్రి, సింఘు, ఘాజీపుర్ వద్ద 2020 నవంబర్ నుంచి ఉద్యమం చేస్తున్నారు. సాగు చట్టాలను రద్దు చేయాలనే ఏకైక డిమాండ్‌తో వారు నిరసనలు చేస్తున్నారు. రాకేశ్ టికాయిత్ ఘాజీపుర్ వద్ద ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే రైతులతో ఇప్పటివరకు 11 దఫాలు కేంద్రం చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం దొరకలేదు.