రాజస్థాన్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. ప్రపంచ మాతృ దినోత్సవం రోజున.. తల్లి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం ఆపసోపాలు పడ్డారు కొడుకులు. చివరకు తోపుడుబండిపై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆస్పత్రిలో చేరాక.. మళ్లీ ఇంటికి..
ఝాలావాడ్కు చెందిన అపర్ణ సుశాంత అనే మహిళ.. గత నెల 30వ తేదీన కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం దబ్లా ఖీంచీలోని కొవిడ్ కేర్ సెంటర్లో చేరారు. తమ బంధువు ఒకరు ఇదే ఆసుపత్రిలో చేరి రెండు రోజుల తర్వాత మరణించారు. ఈ పరిస్థితుల్లో ఆందోళనకు గురైన సుశాంత తనను ఇంటికి తీసుకెళ్లాలని కుమారుడు దినేశ్‌ను కోరారు. తల్లి అభ్యర్థనతో ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేసి.. ఇంటికి తీసుకొచ్చారు దినేశ్, అతడి సోదరుడు. అయితే.. పరిస్థితి విషమించి ఈ నెల 8న(శనివారం) ప్రాణాలు కోల్పోయారు సుశాంత.
ఇదీ చదవండి: చనిపోయిన తర్వాత కొవిడ్ మృతదేహానికి ఆక్సిజన్
ఈ నేపథ్యంలో తల్లి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం దినేశ్, అతడి సోదరుడు తీవ్రంగా శ్రమించారు. చివరకు పోలీసులు, వైద్య సిబ్బందిని వేడుకున్నా.. ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక.. అందుబాటులో ఉన్న తోపుడుబండిపై సుశాంత మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు ముగించారు.
'మాకు సమాచారం అందలేదు'
ఈ ఘటనపై అధికారులు స్పందించారు. కొవిడ్ కేర్ సెంటర్లో మరణించిన రోగికి ప్రోటోకాల్ అనుసరించి.. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే సుశాంత మరణం గురించి తమకెలాంటి సమాచారం అందలేదని ఆస్పత్రి సిబ్బంది బీసీఎంఓ అంకుర్ సోమాని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడికి.. 'సుప్రీం' చొరవే చుక్కాని!