కరోనా రెండో దశ విజృంభణతో మూసేసిన పాఠశాలలు ఇంకా తెరచుకోలేదు. దీంతో ఆన్లైన్ తరగతులు మొదలయ్యాయి. కానీ.. నెట్వర్క్ సదుపాయం లేక రాజస్థాన్లోని బాడ్మేర్లో అనేక మంది చిన్నారులు తరగతులకు దూరంగా ఉంటున్నారు. విద్యార్థుల అసౌకర్యాన్ని గమనించిన ఉపాధ్యాయులు.. వారి వద్దకే వెళ్లి విద్యను బోధిస్తున్నారు. కిలోమిటర్ల కొద్దీ నడుస్తూ.. ఎడారి ప్రాంతాల్లో ఒంటెలపై ప్రయాణిస్తూ విద్యార్థులను చేరుకుంటున్నారు.
రాజస్థాన్లో సుమారు 75 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో చాలామందికి స్మార్ట్ఫోన్లు లేవు. కాబట్టి 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఇళ్లకు వారానికి ఒకసారి వెళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా 9నుంచి 12వ తరగతుల వారి ఇళ్లకు రెండుసార్లు వెళ్లాలని నిర్ణయించింది.
విద్యార్థులకు క్రమం తప్పకుండా పాఠాలు చెప్పేందుకు కొందరు ఉపాధ్యాయులు నిత్యం కృషి చేస్తున్నారని విద్యాశాఖ ఉన్నతాధికారులు అభినందించారు. చిన్నారుల అభివృద్ధికి దోహదపడేలా ఉన్న ఈ చర్యలను మరికొన్ని రోజులు కొనసాగించాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: