Rains In Tamilnadu : తమిళనాడులో భారీ వర్షాలు దంచికొట్టాయి. రాజధాని చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలో అర్ధరాత్రి నుంచి జోరు వాన కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చెన్నై, నుంగంబాకంలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 30 ఏళ్లలో ఇదే అత్యధికమని.. 70 ఏళ్లలో మూడోదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 1990లో 11 సెంటీమీటర్ల వర్షం పడగా.. 1964లో 13 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. కడళూరు, మైలాదుతురాయి, తాంజావురు, నాగపట్నం, తిరువారుర్ సహా పలు జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. జాలర్లు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది.
ఇవీ చదవండి: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు