Rahul Gandhi Golden Temple : సిక్కుల పవిత్ర స్థలం పంజాబ్ అమృత్‌సర్‌లోని ప్రసిద్ధ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సోమవారం ఆలయానికి వెళ్లిన ఆయన.. తలకు నీలం రంగు వస్త్రం కట్టుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మందిరంలోని సిక్కుల అత్యున్నత స్థానం అకల్ తక్త్‌ను సందర్శించారు. ఆ తర్వాత భక్తులు ఉపయోగించిన గిన్నెలను కడిగే సేవా కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. మంగళవారం ఉదయం జరిగే పల్కి సేవా కార్యక్రమంలోనూ రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



కార్యకర్తలు రాకూడదని కోరిన పీసీసీ చీఫ్
Rahul Gandhi Amritsar : అంతకుముందు రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన కోసం అమృత్సర్ వస్తున్నారని ట్వీట్ చేశారు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా సచ్కంద్ శ్రీ హర్మీందర్ సాహెబ్ ఆలయాన్ని సందర్శిస్తారని.. ఆయన వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు ఎవరూ హాజరు కాకూడదని విజ్ఞప్తి చేశారు. రాహుల్ తర్వాత పంజాబ్ పర్యటనకు వచ్చిన సమయంలో మీ మద్దతు, ప్రేమను చూపించాలని చెప్పారు.



కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టైన సమయంలోనే రాష్ట్రానికి రాహుల్
మరోవైపు కాంగ్రెస్, అధికార ఆప్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో రాహుల్.. రాష్ట్రానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2015 నాటి డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను అరెస్ట్ చేసింది పంజాబ్ ప్రభుత్వం. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. ఈ నేపథ్యంలోనే 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు పెట్టుకోవద్దని కాంగ్రెస్ నేతలు పట్టుపడుతున్నారు. అయితే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తీసుకున్న జీరో టాలరెన్స్ పాలసీలో భాగంగానే అరెస్ట్ చేశామని అధికార ఆప్ తిప్పికొడుతోంది.


Rahul Gandhi Meets Railway Coolies : ఇటీవల దిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అక్కడ పనిచేస్తున్న కూలీలతో రాహుల్ మమేకమయ్యారు. అనంతరం రైల్వే కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైల్వే కూలీల యూనిఫాం ధరించి లగేజీని సైతం రాహుల్ మోశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి