AAP in Punjab 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్. బుధవారం.. 10 అంశాలతో ఆప్ 'పంజాబ్ మోడల్'ను ఆవిష్కరించిన కేజ్రీవాల్.. తాజాగా ఓటర్లకు ఓ ప్రతిపాదన చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని నియమించాలో సూచించాలని ప్రజలను కోరారు. ఈ నెల 17 తేదీ సాయంత్రం 5 గంటల్లోపు 70748 70748 ఫోన్ నంబరుకు ఫోన్ లేదా మెసేజ్ చేసి ప్రజలు తమ సూచనలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ యాప్ను లాంచ్ చేసినట్లు తెలిపారు.
Arvind Kejriwal Punjab Elections
"ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు ఓ పార్టీ.. ప్రజాభ్రిపాయాన్ని కోరడం 1947 తర్వాత ఇదే తొలిసారి. జనవరి 17 సాయంత్రం 5 గంటల లోపు 70748 70748 నంబరుకు వాట్సాప్ మెసేజ్, ఫోన్ ద్వారా తమ సలహాలు సూచనలు తెలియజేయవచ్చు. ప్రజల సూచనలు ఆధారంగా పార్టీ సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తాం. నా వ్యక్తిగత అభిప్రాయం కంటే ప్రజల ఎంపికే ముఖ్యం."
-అరవింద్ కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వినర్
Punjab AAP CM candidate: పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే సీఎం అభ్యర్థిపై తన వ్యక్తిగత అభిప్రాయం కంటే ప్రజల ఎంపికే ముఖ్యమన్నారు.
Punjab Assembly Elections
"భగవంత్ మాన్ నాకు చాలా సన్నిహితుడు. సోదరుడి వంటి వారు. పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను ఎంపిక చేయాలని అనుకుంటున్నాను. అయితే దీనిపై తుది నిర్ణయం ప్రజలదే" అని పేర్కొన్నారు.
ఎన్నికల అనంతరం పంజాబ్లో అతిపెద్ద పార్టీగా ఆమ్ ఆద్మీ అవతరిస్తుందని వివిధ సర్వేల్లో వెల్లడైందన్నారు కేజ్రీవాల్. రాష్ట్రంలో ఆప్ అధికారంలోకి వస్తుందని దాదాపుగా ఖరారైందన్నారు. తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని.. భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 60 స్థానాల్లో ఆప్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
ఇదీ చూడండి: భాజపా సీఈసీ భేటీ- యూపీ ఎన్నికల అభ్యర్థుల ఖరారుపై కసరత్తు