భారత సైన్యానికి సంబంధించి ఫేక్ వెబ్సైట్ తయారు చేసి నకిలీ అపాయింట్మెంట్ సర్టిఫికేట్లు ఇస్తోన్న ముఠాను గుర్తించారు మహారాష్ట్ర పుణె పోలీసులు. ఈ ముఠాకు చెందిన భరత్ క్రిష్ణ కాటే అనే నిందితుడిని అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.
భారీగా డిమాండ్ చేసి..
భరత్ కాటేకు.. ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు ముందస్తు శిక్షణ ఇచ్చే అకాడమీ ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్మీలో చేర్చేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.6 లక్షల వరకు తీసుకుంటాడని పేర్కొన్నాయి. డబ్బు చెల్లించిన అభ్యర్థులను ఫేక్ మెడికల్ టెస్టుల నిమిత్తం.. దిల్లీ, రాంచీ, ఝార్ఖండ్, లఖ్నవూ, జబల్పుర్ కేంద్రాలకు పంపుతారని తెలిసింది. అనంతరం భరత్ కాటే.. వారికి నకిలీ అపాయింట్మెంట్ సర్టిఫికేట్లు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
దీనికి సంబంధించి సల్మాన్ గౌసుద్దీన్ షేక్(21) అనే అభ్యర్థి తొలుత కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసుపై పూర్తి దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భరత్ కాటేపై.. మరో 9మంది అభ్యర్థులూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాటే వారినుంచి రూ. 13లక్షలకు పైగా తీసుకున్నట్లు ఆరోపించారు.
ఇదీ చదవండి:జాతీయస్థాయి క్రీడాకారిణిపై పోలీసు అత్యాచారం!