Puja to Real Cobra on Naga Panchami : నాగుల పంచమికి పుట్ట దగ్గర పూజలు చేయడం సాధారణమే.. ఒకవేళ పాము ప్రత్యక్షంగా కనిపిస్తే భక్తులు నేరుగా దానికే పూజలు చేయడం చూసే ఉంటాం... కానీ కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో నిజమైన పామును ఇంటికి తీసుకొచ్చి మరీ పూజలు నిర్వహిస్తోంది ఓ కుటుంబం. ఏటా నాగ పంచమి రోజున ఇలా ప్రత్యేకంగా పూజలు జరుపుతోంది. దీని వెనుక ఆధ్యాత్మికతతో పాటు సామాజికపరమైన కారణం కూడా ఉంది. అదేంటంటే?
Karnataka Real Snake Puja at Home : సిరాసీలోని ప్రశాంత్ హులేకల్ అనే వ్యక్తికి పాములు అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం నాగుల పంచమిని తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రత్యేకంగా ఓ పామును ఇంటికి తీసుకొచ్చి దానికి పూజలు చేస్తారు. ఈసారి మరింత ప్రత్యేకంగా.. పాము పిల్లకు పూజలు చేశారు. సమాజానికి పాములను సంరక్షించాలన్న సందేశాన్ని ఇచ్చేందుకే ఇలా చేస్తున్నట్లు ప్రశాంత్ చెప్పుకొచ్చారు. గడిచిన 35 ఏళ్లుగా ఆయన సరీసృపాల సంరక్షణకు కృషి చేస్తున్నారు.
"చాలా ఏళ్ల నుంచి నేను పాములను కొలుస్తున్నాను. సరీసృపాల సంరక్షుడిగా నేను భిన్నంగా పాములను పూజిస్తాను. సర్పాల గురించి అవగాహన కల్పించేందుకు ఇలా పూజలు చేస్తాను. నాకు పాముల పట్ల ప్రత్యేక భక్తి ఉంది. వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాను."
-ప్రశాంత్ హులేకల్, పాముల సంరక్షకుడు
తండ్రి వారసత్వంగా...!
ప్రశాంత్ తండ్రి సురేశ్ సైతం పాముల సంరక్షణకు పాటుపడేవారు. సురేశ్ మరణం తర్వాత ఆయన తనయులు ప్రశాంత్, ప్రకాశ్, ప్రణవ్‌లు.. పాముల సంరక్షణకు పాటుపడుతున్నారు. ప్రత్యేక పూజలు చేసే బాధ్యతలు తీసుకున్నారు. పాముకు పుష్పాలు, దండలతో అలంకరించి హారతి ఇస్తున్నారు.
అంతేకాదు.. స్థానికంగా ఎక్కడైనా పాము కనిపించిందని ఫోన్ వచ్చిందంటే వీరు అక్కడికి వెళ్లిపోతారు. ఎవరికీ ఏమీ కాకుండా చూసుకుంటూ.. పామును జాగ్రత్తగా పట్టుకుంటారు. ఆ తర్వాత దాన్ని దగ్గర్లోని అడవిలో విడిచిపెడతారు. అటవీ శాఖ అధికారులు సైతం పాములను పట్టేందుకు ప్రశాంత్ సాయం తీసుకుంటారు. నాగుల పంచమి రోజు పూజ చేసే పామును కూడా అడవి నుంచి పట్టుకొస్తారు ప్రశాంత్. ఆ తర్వాత దాన్ని విడిచిపెడతారు.
ప్లాస్టిక్ బాక్స్‌ను మింగేసిన పాము.. హుటాహుటిన ఆస్పత్రికి.. సర్జరీ సక్సెస్!
దాహంతో అల్లాడిన పాము.. నీళ్లు తాగించిన ఆఫీసర్.. లైవ్ వీడియో..