కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న పుదుచ్చేరిలో కూటమి ప్రభుత్వానికి రాజీనామాల పర్వం వేధిస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్యే జాన్ కుమార్ అదే బాటపట్టడం వల్ల కేంద్ర పాలిత ప్రాంతంలో రాజకీయ సెగ రాజుకుంది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పుదుచ్చేరిలో ప్రచారాన్ని మొదలుపెట్టడానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం రానున్నారు. రాహుల్ రాకకు ముందు జాన్ కుమార్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

ప్రస్తుత రాజీనామాలతో.. నామినేటెడ్‌తో కలిపి 33 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఇప్పుడు అధికార- ప్రతిపక్ష కూటములకు సమానంగా చెరో 14 సీట్లు ఉన్నాయి. నాలుగు స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. అధికార పార్టీ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఒక ఎమ్మెల్యేపై జులైలో అనర్హత వేటు పడింది.
ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణా రావు ఈ నెల 15న సీఎం వి. నారాయణస్వామి కేబినేట్ నుంచి వైదొలిగారు. అసెంబ్లీ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందించారు. ఈ పత్రాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తెలిపారు.
మరో ఎమ్మెల్యే జాన్ కుమార్.. స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని ఇప్పటికే అందించారు. ఇంతకుముందు మంత్రి ఎ. నమశ్శివాయం, ఎమ్మెల్యే తీపైంతమ్ రాజీనామా చేశారు.
ఇదీ చదవండి: ఆ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం: దీదీ