ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ సివిల్ కోర్టులో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై పిటిషన్ దాఖలైంది. ఆయన జీవిత చరిత్ర 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్'లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రస్తావించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
జ్ఞాన్ ప్రకాశ్ శుక్లా అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై డిసెంబర్ 1న విచారిస్తామని సివిల్ జడ్జి వినీత్ యాదవ్ తెలిపారు.
అంతర్గత వ్యవహారాల్లో జోక్యమే..
మన్మోహన్, రాహుల్‌పై ఒబామా చేసిన ప్రకటనలు.. ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశమైన భారత్ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమేనని ఆరోపించారు శుక్లా. వీరిద్దరికీ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మద్దతుదారులు ఒబామాపై కోపంగా ఉన్నట్లు చెప్పారు.
ఆత్మకథలో ఏముంది?
ఒబామా తన ఆత్మకథలో రాహుల్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన మరింత పరిణతి సాధించాల్సి ఉందన్నారు. ఆసక్తి, అవగాహన లోపించిన ఒక విద్యార్థి టీచర్‌ను మెప్పించాలని ప్రయత్నిస్తున్నట్లుగా రాహుల్ అనిపించేవారని ఒబామా పేర్కొన్నారు.
మన్మోహన్‌కు సంబంధించి.. ఆయన వాస్తవంగా ప్రజాదరణతో ప్రధాని కాలేదని.. సోనియాగాంధీ వల్లే ఆ స్థాయికి వచ్చారన్నారు. మన్మోహన్‌కు ప్రధాని పదవిని కట్టబెడితే.. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోయే స్థాయికి ఎదగాల్సిన తన 40 ఏళ్ల కుమారుడు రాహుల్‌గాంధీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న భావనతోనే సోనియా ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు ఒబామా అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: ఆధునిక కాలంలో భారత్‌ది విజయగాథ: ఒబామా