Cattle Handler in Formal Dress: సాధారణంగా ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఫార్మల్ దుస్తుల్లో వస్తుంటారు. కానీ ఇలాంటి దుస్తులు ధరించి పశువులను నడిపించడం, వాటి బాగోగులు చూస్తుండటం ఎక్కడైనా చూశారా? తమిళనాడులోని వెల్లూరు జిల్లా స్థానిక వెటర్నరీ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. వెటర్నరీ కేర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం అక్కడి యువత పోటీపడుతోంది.
జిల్లాలో 22 పోస్టులకు 2015లోనే నోటిఫికేషన్ జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే ఓ కోర్టు కేసు కారణంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా కారణంగా ఇది మరింత ఆలస్యమైంది. మొత్తానికి సుమారు ఏడేళ్ల తర్వాత ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదో తరగతి పాస్ అయినా, ఫెయిల్ అయినా.. ఈ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు అర్హులే. 22 పోస్టుల కోసం దాదాపు 5000 మంది పోటీపడుతున్నారు. వీరిలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్గ్రాడ్యుయేట్లు, ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారు.
రోజుకు 800 మందికి చొప్పున జరుగుతున్న ఈ పరీక్షలకు చాలా మంది ఫార్మల్ దుస్తులు ధరించి వస్తున్నారు. సైకిల్ తొక్కడం, పశువును కట్టడం, పశువుల సంరక్షణ వంటివి పరీక్షలో భాగం. వీటితో పాటు కొన్ని సామాజిక విషయాలపైన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఉద్యోగ భద్రత, నెలవారీ టార్గెట్లు వంటి ఒత్తడి లేకపోవడం, సొంతూరులోనే పనిచేసుకునే అవకాశం ఉండటం వల్లే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నామని అంటున్నారు అభ్యర్థులు.
ఇదీ చూడండి : సినిమా స్టైల్లో ఛేజింగ్.. 22కి.మీ టైర్ లేకుండానే ప్రయాణం