గుజరాత్లోని చారిత్రక సోమనాథ్ ఆలయంలో రూ.83 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. వర్చువల్ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా పార్వతీ దేవీ ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా పలువురు నేతలు పాల్గొనున్నారు.
శ్రీ సోమనాథ్ ట్రస్ట్(ఎస్ఎస్టీ) ఛైర్మన్గా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ.. మూడు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారని ఎస్ఎస్టీ ట్రస్టీ, కార్యదర్శి పీకే లహరీ తెలిపారు. ప్రధాన ఆలయం వద్ద రూ.30 కోట్లతో నిర్మిస్తున్న పార్వతీ దేవీ ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. రామ మందిర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
సోమనాథ్ ఆలయం వెనుక సముద్ర తీరంలో రూ.49 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కిలోమీటర్ పొడవైన 'సముద్ర దర్శనం' నడక మార్గాన్ని ప్రధాని ప్రారంభించనున్నారని లహరీ చెప్పారు. కొత్తగా నిర్మించిన ఓ మ్యూజియాన్నీ ప్రారంభిస్తారని వెల్లడించారు.