PM Modi speech in Karnataka : ఉగ్రవాదంపై తెరకెక్కించిన ది కేరళ స్టోరీ చిత్రాన్ని వ్యతిరేకించి.. కాంగ్రెస్ పార్టీ ముష్కరుల పక్షాన నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ.. ఉగ్రవాదానికి రక్షణగా నిలిచిందని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారి నియోజకవర్గంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఉగ్రవాదులకు తలవంచిన పార్టీ రాష్ట్రాన్ని ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. కర్ణాటకను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మార్చే రోడ్‌మ్యాప్ తమ వద్ద ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తం అబద్ధాలు, నిషేధాలతో నిండిపోయిందని మండిపడ్డారు.
"ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది. కాలంతో పాటు ఉగ్రవాదం తీరు మారుతోంది. బాంబులు, తుపాకుల శబ్దాలు లేకుండా ఉగ్రవాదం వ్యాప్తి చెందుతోంది. దీనిపై కోర్టులు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మధ్య 'ది కేరళ స్టోరీ' అనే సినిమాపై చర్చ జరుగుతోంది. ఓ రాష్ట్రంలోని ఉగ్రకుట్రల గురించి ఆ చిత్రంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాదం మానవాళికి వ్యతిరేకం. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకు లొంగిపోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యం. బీజేపీ ఎల్లప్పుడూ ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించింది. కాంగ్రెస్‌కు మాత్రం.. ఉగ్రవాదం గురించి ఎప్పుడు ప్రస్తావించినా కడుపులో నొప్పి వస్తుంటుంది."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
Karnataka election 2023 : స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి నుంచి దేశంలోని వ్యవస్థలను, రాజకీయాలను కాంగ్రెస్ అవినీతిమయం చేసిందని మోదీ ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు గత కొన్నేళ్ల నుంచి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సైతం కాంగ్రెస్ అవినీతి గురించి పరోక్షంగా ఒప్పుకున్నారని మోదీ చెప్పుకొచ్చారు. 'దిల్లీ నుంచి వంద పైసలు పంపిస్తే.. పేదలకు 15 పైసలే చేరుతున్నాయని రాజీవ్ గాంధీ చెప్పారు. ఓ రకంగా కాంగ్రెస్ 85 శాతం కమీషన్ తీసుకునే పార్టీ అని ఆయన అంగీకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక అభివృద్ధి గురించి కాకుండా.. అవినీతిపైనే దృష్టిపెట్టింది' అని మోదీ ఆరోపించారు.
గిరిజనుల సంస్కృతిని కాంగ్రెస్ గౌరవించదని మోదీ ధ్వజమెత్తారు. ఆ వర్గాలను బలోపేతం చేసేందుకు చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వదని అన్నారు. గిరిజన మహిళను తాము రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. కాంగ్రెస్ ఆమెను వ్యతిరేకించిందని గుర్తు చేశారు. సూడాన్ సంక్షోభాన్ని సైతం రాజకీయాలకు ఉపయోగించుకుందని మోదీ మండిపడ్డారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నాలు చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ దేశానికి అండగా నిలబడలేకపోయిందని అన్నారు. సంక్షోభంలో రాజకీయాలు చేసినందుకు కాంగ్రెస్.. మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.
రోడ్‌షోలో మార్పులు..
మరోవైపు, బెంగళూరులో మోదీ పాల్గొనాల్సిన భారీ రోడ్‌షోలో మార్పులు జరిగాయి. ఆదివారం నీట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో.. ఆ రోజు ర్యాలీని కుదించినట్లు తెలిపాయి. శనివారం (మే 6)న రోడ్‌షో సుదీర్ఘంగా సాగుతుందని వెల్లడించాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 6న 10 కి.మీ, మే 7న 26 కి.మీ రోడ్‌షో ఉండగా.. దీన్ని మార్చేశారు. 26 కి.మీ రోడ్‌షోను మే 6కు బదిలీ చేశారు. 'మే 6, 7 తేదీల్లో మోదీ రోడ్‌షో ఉంటుంది. నీట్ పరీక్ష ఉందని మీరు (మీడియాను ఉద్దేశించి) మాకు గుర్తు చేశారు. దీనిపై మోదీకి సమాచారం ఇచ్చాం. పరీక్షాపే చర్చ వంటి కార్యక్రమాలు చేపడుతున్న ప్రధాని.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. రోడ్‌షోలో మార్పులు చేయాలని స్పష్టం చేశారు. దాని ప్రకారం రోడ్‌షోలో మార్పులు చేశాం' అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వివరించారు.