PM Modi In Sagar : త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. సాగర్ జిల్లాలో ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.100 కోట్లతో 11 ఎకరాల్లో నిర్మించనున్న ఆలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని సంత్ రవిదాస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆలయంలో మ్యూజియాన్ని ఏర్పాటు చేసి రవిదాస్ తత్వబోధనలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిసింది.
PM Modi Madhya Pradesh Visit : కాగా.. మధ్యప్రదేశ్‌లో 4 వేల కోట్ల రోడ్ల విస్తరణ, రైల్వే అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. రూ.2,475 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన కోట-బినా రైలు మార్గం డబ్లింగ్‌ను జాతికి అంకితం చేస్తారు. దాదాపు రూ.1,600 కోట్లతో మొరికొరి- విదిష-హినోతియలను కలిపే 4 లైన్ల రోడ్ ప్రాజెక్టుతోపాటు, హినోతియా- మెహ్లువాలను కలిపే రోడ్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.
"పేదల సంక్షేమం, సమాజంలోని అన్ని వర్గాల సాధికారతే మా లక్ష్యం. దళితులు, వెనుకబడిన లేదా గిరిజనులకు తమ ప్రభుత్వం తగిన గౌరవాన్ని ఇస్తోంది. అన్ని రంగాల్లో అవకాశాలను కల్పిస్తోంది. కొవిడ్ మహమ్మారి సమయంలో, పేదలను ఆకలితో నిద్రపోనివ్వకూడదని నేను నిర్ణయించుకున్నాను. మీ బాధను అర్థం చేసుకోవడానికి నేను పుస్తకాలు వెతకాల్సిన అవసరం లేదు. మేము ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను ప్రారంభించాము. 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందించాం. మేం చేసిన పనులను ప్రపంచం మొత్తం అభినందిస్తోంది"
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
అందరికి తెలిసేలా..
Sant Ravidas Temple MP : నూతన సంత్ రవిదాస్ ఆలయాన్ని 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 'నగరా' శైలిలో నిర్మించనున్నారు. ఈ ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. సంత్ రవిదాస్ గురించి ఆధునిక సమాజానికి తెలిసేలా ఓ మ్యూజియాన్ని సైతం ఇందులో ఏర్పాటు చేయనున్నారు. అందులో రవిదాస్ భక్తి మార్గం, నిర్గుణ ఆరాధన, తత్వశాస్త్రం, సాహిత్యం అంశాలకు సంబంధించిన గ్యాలరీలు ఉంటాయి. గ్రంథాలయం, సమావేశ మందిరం, జల కుంద్, భక్తి నివాస్‌లను సైతం నిర్మించనున్నారు. ఈ ఆలయం నిర్మితమైతే.. దేశ, విదేశాల నుంచి సంత్ రవిదాస్ భక్తులు ఈ ప్రాంతానికి తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భోజనశాల కూడా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Sant Ravidas History In Telugu : 14వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్తగా సంత్ రవిదాస్ ఖ్యాతి పొందారు. మధ్యయుగ కాలంలో భారతదేశంలో భక్తి ఉద్యమం బాగా ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలో ప్రముఖుల్లో ఒకరిగా సంత్ రవిదాస్ కీర్తి గడించారు. అయితే ఇదివరకే సత్నా జిల్లాలోని మైహర్‌లో రూ.3.5 కోట్ల వ్యయంతో సంత్ రవిదాస్ ఆలయాన్ని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్మించింది. బుందేల్ ఖండ్‌లో భాగమైన సాగర్‌లో 20-25 శాతం దళిత జనాభా నివసిస్తున్నారు. రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాల్లో 35 ఎస్సీ రిజర్వ్‌డ్. 2013 ఎన్నికల్లో బీజేపీ వీటిలో 28 స్థానాలు కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో మాత్రం ఆ సంఖ్య భారీగా పడిపోయింది. బీజేపీ 18 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలిచింది.
మరో 9 నగరాలకు వందే భారత్.. ఒకేసారి 5 రైళ్లకు జెండా ఊపిన మోదీ
'ఫేక్ గ్యారెంటీలతో వస్తున్నారు జాగ్రత్త .. వారి పట్ల అప్రమత్తంగా ఉండండి'.. విపక్షాలపై మోదీ ఫైర్