గుజరాత్లోని కేవడియాలో జరుగుతున్న ఉన్నత స్థాయి సైనిక అధికారుల సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రదర్శించిన సాయుధ దళాల ఆవిష్కరణలను కొన్నింటిని మోదీ వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఏడాది కాలంగా భారత సాయుధ బలగాలు చూపుతోన్న సేవానిరతిపై ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ గొప్పగా పోరాడి.. ఉత్తర సరిహద్దులో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని చెప్పారు.
భారత సైనిక దళాన్ని భవిష్యత్ శక్తిగా అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ కోరారు. కాలం చెల్లిన సైనిక విధానాలను విడిచిపెట్టాలని చెప్పిన మోదీ.. వేగంగా నిర్ణయాలు తీసుకునే విధానాలపై దృష్టిసారించాలన్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన మూడు రోజుల సుదీర్ఘ సమావేశంలో చర్చల గురించి ప్రధానికి సిబ్బంది వివరించగా.. సదస్సు నిర్వహణ, ఎజెండా పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. జూనియర్ కమిషన్డ్ అధికారులు, నాన్ కమిషన్డ్ అధికారులను ఇందులో చేర్చడాన్ని మోదీ ప్రశంసించారు.
ఇదీ చదవండి: 'రామ మందిర నిర్మాణానికి రూ.2,500కోట్ల విరాళాలు'