Peon Sold office property : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మందు కోసం తాను పని చేసే ఆఫీస్‌లోని వస్తువులనే అమ్మేశాడు. ఈ ఘటన ఒడిశాలోని గంజామ్ జిల్లా విద్యా శాఖ అధికారి-డీఈఓ కార్యాలయంలో జరిగింది. నిఘా ఉంచమని బాధ్యత అప్పచెబితే అతడు తన చేతివాటాన్ని చూపించాడు. దాదాపు రెండేళ్లలో తలుపులతో సహా మొత్తం ఆఫీస్‌నే ఖాళీ చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని గంజామ్ జిల్లాలో రెండేళ్ల క్రితం డీఈఓ కార్యాలయాన్ని అధికారులు కొత్త భవనానికి మార్చారు. అవసరమైన సామగ్రిని కొత్త ఆఫీస్‌కు మార్చారు. కొన్ని ఫైల్స్‌తో పాటు ఫర్నీచర్‌ను పాత ఆఫీస్‌లోనే ఉంచారు. ఆఫీస్‌కు కాపలాగా ఉండమని ప్యూన్ పీతాంబర్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్లు ఆ బిల్డింగ్ వైపు చూడలేదు విద్యా శాఖ అధికారులు.
ఇదే అదునుగా చేసుకుని పీతాంబర్ ఆఫీస్‌లో ఉన్న వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా మాయం చేసుకుంటూ వచ్చాడు. అలా 20కి పైగా అల్మరాలు, 10 సెట్ల కుర్చీలు, బల్లలు, పాత ఫైల్స్‌ను అమ్మేశాడు. కొన్ని కిటికీలను సైతం మాయం చేశాడు. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఆ బిల్డింగ్ ఉన్నప్పటికీ ఇవన్నీ చోరీకి గురవడం విశేషం. ఇంత జరుగుతున్నా.. జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరూ అటువైపు రాకపోవడం వల్ల పీతాంబర్‌కు మరింత ధైర్యం పెరిగింది. ఇదే సరైన సమయంగా భావించి తలుపులతో సహా అన్నింటినీ సర్దేశాడు ఆ ప్యూన్.
ఓ రోజు సెక్షన్ ఆఫీసర్ జయంత్ కుమార్ సాహూ కొన్ని ఫైల్స్ కోసం పాత ఆఫీస్‌కు వచ్చారు. తీరా అక్కడ చూస్తే రూం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. ఆశ్చర్యపోయిన ఆఫీసర్ కార్యాలయంలో దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ బిల్డింగ్‌కు కాపాలాగా ఉన్న ప్యూన్ పీతాంబరాన్ని అనుమానితుడిగా భావించి, పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే ఈ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. మద్యం తాగేందుకు డబ్బుల కోసమే ఇదంతా చేసినట్లు చెప్పాడు. పోలీసులు పీతాంబర్‌ను, అతడి వద్ద సామగ్రి కొన్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్యూన్‌ను విధుల్లో నుంచి తొలగించామని, తదుపరి విచారణని చేపడుతామని డీఈఓ తెలిపారు.
ఇదీ చదవండి: 'ఆపరేషన్ PFI' ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీ దాడులు
విదేశాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఇక ఆ సర్టిఫికెట్ అప్లై ఆన్‌లైన్‌లోనే!