ప్రజాప్రతినిధులపై 4,984 పెండింగ్ కేసులు - ఎమ్మెల్యేలపై పెండింగ్ కేసులు
pending cases on lawmakers: ప్రజాప్రతినిధులపై ఇప్పటివరకు 4,984 పెండింగ్ కేసులు ఉన్నాయని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తెలిపారు. వీటిలో సుమారు 1,899 కేసు ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం నుంచి పేరుకుపోయినట్లు చెప్పారు.
pending cases on lawmakers: చట్టసభల సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,984 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పేరుకుపోయినవే 1899 అని సీనియర్ న్యాయవాది, కోర్టు సహాయకుడు విజయ్ హన్సారియా గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రజాప్రతినిధులపై అపరిష్కృతంగా ఉన్న కేసులకు సంబంధించి ఆయన తాజా నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఓ వైపు కృషి జరుగుతున్నా, మరోవైపు వాటి సంఖ్య పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 డిసెంబరుకు 4,110 కేసులు పెండింగ్‌లో ఉంటే, 2020 అక్టోబరుకు వాటి సంఖ్య 4859కు పెరిగిందని తెలిపారు.
'2018 డిసెంబరు 4 తర్వాత 2,775 కేసులు పరిష్కరించినా, ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసులు 4,122 నుంచి 4,984కు పెరిగాయి. దీన్ని బట్టి నేర చరిత్ర ఉన్న వ్యక్తులు మరింత ఎక్కువగా పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల్లోకి ప్రవేశిస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వీరిపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసుల పరిష్కారంలో సత్వర, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని నివేదిక పేర్కొంది.
చట్టసభ్యులపై నమోదైన కేసుల్లో న్యాయ విచారణతో పాటు, సీబీఐ ఇతర సంస్థల దర్యాప్తు కూడా వేగవంతం చేయాలని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ఈ పిటిషన్‌కు సంబంధించి హన్సారియా.. కోర్టు సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
చట్టసభ్యులపై కేసుల విచారణకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశాయని నివేదిక తెలిపింది. చాలా రాష్ట్రాల్లో ఎస్సీఎస్టీ, పోక్సో లాంటి చట్టాల పరిధిలోని కేసులను విచారిస్తున్న న్యాయమూర్తులే ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులనూ విచారిస్తున్నారని, దీంతో విపరీతమైన జాప్యం జరుగుతోందని హన్సారియా చెప్పారు. మరోవైపు వేగవంత విచారణకు అనుకూలంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ 2021 ఆగస్టు 25న జారీ చేసిన ఉత్తర్వులపై ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదని న్యాయస్థానం దృష్టికి హన్సారియా తీసుకువచ్చారు. ఈ కేసుల సత్వర పరిష్కారానికి డిఫెన్స్, ప్రాసిక్యూషన్ సహకరించుకొనేలా, వాయిదాలు వేయకుండా చూడాలని, ఈ మేరకు మార్గదర్శకాలను అత్యున్నత న్యాయస్థానం జారీ చేయాలని హన్సారియా కోరారు.
ఇదీ చూడండి: 'పోలీసు యంత్రాంగాన్ని రాష్ట్రాలు దుర్వినియోగం చేయకూడదు'