Jana Sena chief Pawan Kalyan meeting in Pithapuram :జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పిఠాపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేన అధికారం ఇవ్వాలని, తనను ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ముఖ్యమంత్రి పదవి చేపడితే దేశంలోనే ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు.
నేరస్తులంటే నాకు అసహ్యం.. పిఠాపురం బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. తనకు మత పిచ్చి లేదని.. సనాతన ధర్మం పట్ల గౌరవం ఉందని అన్నారు. అందరినీ సమానంగా చూసి ధర్మాన్ని చెప్పిన నేల ఇది.. వేదాలు తీసుకువచ్చిన బ్రాహ్మణ సమాజానికి నమస్కారాలు అని పేర్కొన్నారు. పిఠాపురంలో హిందూ దేవాలయాల ధ్వంసం దారుణమని తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆలయాన్ని ధ్వంసం చేసింది పిచ్చివాడని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేస్తూ.. 219 హిందూ ఆలయాల్లోనూ పిచ్చివాళ్లే ధ్వంసం చేశారా? అని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఒక్కరినీ పట్టుకోలేదని మండిపడ్డారు. నా ఆంధ్ర నేల కోసం నిలబడతా అని చెప్పిన పవన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గూండాలకు నిలయం... వీళ్లా మనల్ని పాలించేది.. మనకు సిగ్గుండాలి.. నేరస్తులంటే నాకు అసహ్యం అని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేగా గెలిచే వ్యూహాలున్నాయి... కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు పిఠాపురం పరిధిలోని 52 గ్రామాల నుంచి రెండు కోట్ల రూపాయల మట్టి దోచుకెళ్తున్నారు.. వారి సంగతి రేపు కాకినాడలో చెబుతాను అంటూ పవన్ హెచ్చరించారు. 300 లారీల మట్టి దోచే వాళ్లని కాళ్లు విరగగొట్టి మీకు ఉపాధి చూపించొచ్చు.. దోపిడీనీ అడ్డుకుంటే మీకు పది వేల కోట్లతో ఉపాధి చూపించొచ్చు అని పవన్ పేర్కొన్నారు. నేను బతికి ఉన్నంత వరకు నేర చరిత్ర ఉన్న వాళ్లు గద్దె ఎక్కడానికి వీల్లేదని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. ఆంధ్ర బాగుపడాలంటే మన కులపోడా, కాదా అన్నది చూడవద్దు.. మనకు సరైనోడా కాదా అన్నది చూడండి అని పిలుపునిచ్చారు. మనకు అధికారం లేకపోతేనే ఇంత భయపడుతున్నారే.. ఎమ్మెల్యేను చేసి చూడండి.. సీఎం స్థానం ఇస్తే ఆంధ్రను దేశంలోనే ఉన్నత స్థానంలో తీర్చిదిద్దుతా అని అన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి.. పిఠాపురం దేవుళ్ల సాక్షిగా అడుగుతున్నానని.. తనకు అధికారం ఇవ్వండి అని పవన్ అభ్యర్థించారు. తాను డిగ్రీలు చదవకపోయినా రోజూ 5నుంచి 8 గంటలు చదువుతా అని చెప్పిన పవన్.. ఎంపీ కుటుంబం కిడ్నాప్ అంశంలో డీజీపీ మాటలు బాధకలిగిస్తున్నాయని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి ఏ వ్వూహమైనా పన్నుతా.. కాకినాడ ఎమ్మెల్యే కోసం అమిత్ షా వద్ద రిపోర్టు ఉంది అని తెలిపారు. పన్నులు పెంచి అభివృద్ధి అని గొప్పలా..? బిల్డింగ్ అనుమతులకు 40 నుంచి 70శాతం టాక్స్ పెంచుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను సినిమా చేస్తే ఇండస్ట్రీలో 70 నుంచి 80 శాతం మందికి ఉపాధి దొరుకుతుందని పవన్ పేర్కొన్నారు.