Constitution Day Celebration 2024 : భారత రాజ్యాంగం సజీవ, ప్రగతిశీల గ్రంథమని- దాని ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదని రాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగ రచనలో 15 మంది మహిళలు భాగస్వాములైనట్లు రాష్ట్రపతి గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టంతో మహిళా సాధికారత దిశగా కొత్తశకం మొదలైనట్లు చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.
'రాజ్యాగం మన పవిత్ర గ్రంథం. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగింది. రాజ్యాంగానికి రాజేంద్రప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి రాజ్యాంగంలో పొందుపర్చారు. రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలి. గత కొన్నేళ్లలో ప్రభుత్వం దేశంలోని అన్నివర్గాలు ముఖ్యంగా బలహీనవర్గాల అభివృద్ధి కోసం అనేకచర్యలు తీసుకుంది. అలాంటి నిర్ణయాలతో ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి. వారికి అభివృద్ధికి సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. పేదప్రజల సొంతింటి కల నిజమవుతోంది. విద్యుత్తు, తాగునీరు, రోడ్డు సదుపాయాలు లభిస్తున్నాయి. వైద్యసేవలు కూడా లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సమగ్ర అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలు రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాయి' అని ముర్ము ప్రసంగించారు.
VIDEO | President Droupadi Murmu addresses at the Central Hall of the Parliament during the 'Constitution Day' celebrations.
— Press Trust of India (@PTI_News) November 26, 2024
(Source: Third Party)#ConstitutionDay2024 pic.twitter.com/LcZuJUtwhM
రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సభ్యులందరితో కలిసి రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం చేశారు. అంతకుముందు రాజ్యాంగానికి సంబంధించిన రెండు పుస్తకాలు, 75 వసంతాలకు గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. మైథిలీ, సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా పాల్గొన్నారు.
'అలా చేస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు'
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కంటే వ్యక్తిగత విశ్వాసాలకు ప్రాధాన్యం ఇస్తే మనం సాధించుకున్న స్వాతంత్ర్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు. గందరగోళం సృష్టించడాన్ని ఒక వ్యూహంగా అమలు చేస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. నిర్మాణాత్మక చర్చలు ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పెంపొందిస్తాయని తెలిపారు. అంతకంటే ముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభోపన్యాసం చేశారు. 75 ఏళ్ల క్రితం ఆమోదించిన రాజ్యాంగంపై చర్చించేటప్పుడు రాజ్యాంగ సభ నిర్దేశించిన నిర్మాణాత్మక, గౌరవప్రదమైన చర్చల సంప్రదాయాన్ని అనుసరించాలని సూచించారు.