Woolen Clothes Washing Tips: చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో చలి నుంచి రక్షణ పొందేందుకు వార్డ్‌రోబ్‌లో నుంచి స్వెట్టర్లు, మఫ్లర్లు, ఇతర ఉన్ని దుస్తులు బయటికి తీస్తుంటారు. ఇక ఉన్ని దుస్తులు ఉపయోగించేటప్పుడు వాటిని ఉతికేస్తుంటాం. అయితే వాటిని అన్ని వస్త్రాలతో కలిపి కాకుండా విడిగా శుభ్రపరచాల్సి ఉంటుందని.. అలాగే ఉతికే విధానం కూడా వేరుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎండలో ఉంచాలి: మిగిలిన దుస్తులతో పోలిస్తే.. ఉన్ని దుస్తులను తరచూ శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు. అయితే ఎక్కువ రోజులు వాడకుండా పక్కన ఉంచడం వల్ల వాటి నుంచి అదో రకమైన వాసన వస్తుంటుంది. అయితే ఉన్ని దుస్తులను భద్రపరిచే ముందే ఉతుకుతాం కాబట్టి.. వాటిని ఒకసారి ఎండలో వేస్తే సరిపోతుందని.. ఇలా చేయడం వల్ల వాటి నుంచి వచ్చే వాసన పోతుందంటున్నారు. అలాగే వాటిలో ఏమైనా క్రిములు చేరినా అవి కూడా నశించే అవకాశం ఉంటుందని అంటున్నారు.
సపరేట్గా ఉతకాలి: ఉన్ని దుస్తులను మిగిలిన వాటితో కలిపి ఉతకడం సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే అవి ముడుచుకుపోయే అవకాశం ఉంటుందని.. అందుకే వాటిని విడిగా శుభ్రం చేయాలంటున్నారు. దీని కోసం ఉన్ని దుస్తులను చన్నీళ్లలో పూర్తిగా మునిగేలా ఉంచాలి. కొంతమంది బాగా శుభ్రపడతాయనే ఆలోచనతో ఉన్ని దుస్తులను గంటల తరబడి డిటర్జెంట్ పౌడర్‌లో నానబెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఉన్ని త్వరగా పాడైపోతుందని.. డిటర్జెంట్ పౌడర్ కలపని నీటిలో మాత్రమే వాటిని కొద్దిసేపు నాననివ్వాలని సూచిస్తున్నారు.
గట్టిగా రుద్దకూడదు: ఉన్ని దుస్తులపై ఏవైనా మరకలు పడినట్లైతే కొంతమంది వాటిని బలంగా రుద్దుతుంటారు. దీనివల్ల మరక పోవడం సంగతి పక్కన పెడితే దుస్తులు పాడైపోతాయని.. ఇలా జరగకుండా ఉండాలంటే ఉన్ని దుస్తులు పూర్తిగా నానిన తర్వాత ఉప్పు, డిష్‌వాష్ లిక్విడ్, వెనిగర్.. మొదలైనవి ఉపయోగించి నిధానంగా రుద్దితే సరిపోతుందని అంటున్నారు. ఇలా రుద్దిన తర్వాత ఒకసారి నీటిలో జాడించి తీస్తే సరి.
ఆ డిటర్జెంట్ వద్దు: చాలా మంది సాధారణ వస్త్రాలను ఉతకడానికి ఉపయోగించే డిటర్జెంట్‌నే ఉన్ని దుస్తులను ఉతకడానికి కూడా ఉపయోగిస్తారు. కానీ వాటిని శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయని.. అవి ఉపయోగిస్తే.. ఉన్ని నాణ్యత తగ్గకుండా ఉంటుందని అంటున్నారు. ఒకవేళ అవి అందుబాటులో లేనట్లయితే బేబీ షాంపూని సైతం ఉపయోగించవచ్చని.. చల్లటి నీటిలో కొద్దిగా బేబీ షాంపూ కలిపి వాటితో ఉన్ని దుస్తులు ఉతికితే అవి శుభ్రపడడంతో పాటు.. వాటి నాణ్యత కూడా దెబ్బతినకుండా ఉంటుందని చెబుతున్నారు.
ఉన్ని దుస్తుల లేబుల్స్ చెక్ చేయండి: చాలా మంది ఉన్ని దుస్తులను వాషింగ్ మెషీన్లో వేసి శుభ్రం చేస్తుంటారు. అయితే స్వెటర్లు, మఫ్లర్లు, ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు వాటి లేబుల్స్ చెక్ చేయడం మంచిదంటున్నారు. లేబుల్‌పై ఉన్న సూచనలు పాటిస్తూ.. వాటిని క్లీన్ చేస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని అంటున్నారు.
మంచు కురిసే వేళ డ్రైవింగ్ చేస్తున్నారా? - అయితే ఈ జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదమే!
కాపర్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారా? - ఇలా క్లీన్ చేయకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదట!
ఈ చలికాలంలో గీజర్ కొనాలనుకుంటున్నారా? - ఇవి తెలియకపోతే ముప్పు!