Health Tips Should Follow During Winter Season : రాష్ట్రంలో వర్షాకాలం తర్వాత సీజనల్ వ్యాధులు పెరిగాయి. డెంగీ, గన్యా, మలేరియా లాంటి జ్వరాలు ప్రజలను అల్లాడించాయి. అవన్నీ నవంబరు మొదటి వారం వరకు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ తరుణంలో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. ఉదయం దుప్పటి తీస్తే చలి ఎక్కువగా ఉంటోంది. బయటికి వెళితే వణుకుతున్నారు. ఏ ఇంట్లో చూసిన జలుబు, దగ్గు బాధితులు కనిపిస్తున్నారు. వాతావరణ శాఖ వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని ప్రకటించింది అదే సమయంలో చలి తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రధానంగా రెండేళ్లలోపు పిల్లలు, 65ఏళ్లు దాటిన వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆసుపత్రులకు పెరిగిన రోగుల తాకిడి : ప్రస్తుతం ఇంటింటా దగ్గులు, జ్వరాలు పెరిగిపోతున్నాయి. గతవారం, పది రోజులుగా పిల్లల్లో శ్వాసకోశ సంబంధింత సమస్యల తీవ్రత సాధారణ పరిస్థితులతో పోలిస్తే 20శాతం నుంచి 30శాతం పెరిగిందని, వృద్ధులూ ఇదే తరహాలో బాధపడుతున్నారని వైద్యాశాఖ అంచనా వేసింది. ఫలితంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. మొత్తంగా వీటికి రోజుకు సగటున 42 వేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఇది సాధారణమే అయినా రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యశాఖ అంచనా వేసింది. ఒక్క సోమవారం నాటి పరిస్థితిని ఆరా తీస్తే అన్ని ప్రభుత్వాసుపత్రులకు 55,724 మంది ఔట్‌పేషెంట్లు వస్తే వారిలో 3,859 మంది ఎమర్జెన్సీ వార్డులో, 3,030 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. 41,651 మందికి వైద్యులు వివిధ ల్యాబ్ పరీక్షలు చేశారు.
"ఉష్ణోగ్రతలు బాగా తగ్గడంతో రెండేళ్లలోపు పిల్లల్లో లోయర్ రెస్పిరేటరీ, రెండు నుంచి ఐదేళ్లలోపు వారిలో అప్పర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయి. తల్లిదండ్రులు వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం, రాత్రి వేళల్లో పిల్లలను బయటకు తీసుకెళ్లొద్దు. ఆహారం వేడిగా ఇవ్వాలి. బయటి ఆహారం వీలైనంత వరకు తగ్గించాలి. వాటివల్ల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువయ్యే ప్రమాదముంది. బాధితుల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా, అధిక జ్వరమున్నా, పక్కటెముకలు ఎగరేసినా, కాళ్లు చేతులు చల్లగా మారినా వెంటనే వైద్యులను సంప్రదించాలి." - డాక్టర్ ఎం.శేషుమాధవ్, పిల్లల వైద్య నిపుణులు, హనుమకొండ
పిల్లలపై ప్రభావం : చలి వాతావరణంలో పిల్లలపై ఎక్కువగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముంది. ముఖ్యంగా హైపోథెర్మియా (శరీరం చల్లబడటం)తో సమస్యలు పెరుగుతాయి. మొదట జలుబు సోకి, తర్వాత వైరస్‌లతో న్యుమోనియా, ఫ్లూ లాంటివి అధికమై కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. చలికాలంలో పిల్లల్లో ఆకలి సైతం తగ్గుతుంది. దీంతో వారు మరింత నీరసపడిపోతారు. వారి చర్మం కూడా పొడిబారుతుంది. దీంతో దురద పెరుగుతుంది. పెదాలు పగిలి బాధపడుతుంటారు.
చలికాలంలో తీవ్ర ఒళ్లు నొప్పులా? - ఈ చిన్నపాటి వ్యాయామాలతో చక్కని ఆరోగ్యం మీ సొంతం
వృద్ధులపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముక్కు కారడం మొదలవుతోంది. దీన్ని అప్పర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ అంటారు. దీనివల్ల శ్వాస ఇబ్బందితో పాటు దగ్గు పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ లోపలికి చేరితే కనీసం రెండు నెలల వరకు ఇబ్బంది పడుతారని హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరు, గాలి, దుమ్ము లోపలికి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సీజన్‌లో ఆస్తమా ఉన్నవారు చలిబారిన పడితే అది మరింత ఎక్కువవుతుందని, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు కూడా దాడి చేసే ప్రమాదం ఉందని అంటున్నారు.
"చలికాలంలో జలుబు, దగ్గులు రావడం సహజమే కానీ ఈసారి మాత్రం ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటికే వీటి బారినపడితే వైద్యులను సంప్రదించాలి, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, ఆస్తమా ఉన్నవారు మాత్రం మరింత జాగ్రత్త వహించాలి. ఇన్‌ఫెక్షన్ సోకి ప్రమాదం పెరుగుతుంది. చలికాలంలో వృద్ధులు వాకింగ్ చేస్తుంటే మూతి వంకర పోయే ప్రమాదముంది. దీన్ని వైద్య పరిభాషలో బెల్స్‌పాల్సీ అంటారు. అందుకు చలిగాలులు చెవుల్లోకి వెళ్లకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. గోరు వెచ్చని నీరు తాగటం ఉత్తమం. వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలి. చర్మం ఎండిపోకుండా మాయిశ్చరైజర్లు, నూనెలు రాసుకోవాలి. తెల్లవారుజామునే కాకుండా, కాస్త ఎండ వచ్చాక వ్యాయామం, వాకింక్ చేయాలి." - డాక్టర్ వనం శ్రీనివాస్, ఎం.డి.(జనరల్ మెడిసిన్), భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి
రోజూ ఇలాంటి ఆహారం తీసుకుంటే - చలికాలంలో సూపర్ హెల్దీగా ఉండొచ్చు!
చలికాలంలో ఏసీ వాడుతున్నారా? ఆస్థమా, ఇన్ఫెక్షన్లతో జాగ్రత్త! ఈ చిట్కాలు పాటిస్తే సరి!!