ETV Bharat / bharat

పాక్​ తెలివిగా ప్లాన్​ చేసింది కానీ..! - భారత్​ పాక్​ యుద్ధం 1971

1971 యుద్ధంలో భారత్​ను ఒడించేందుకు పాకిస్థాన్​ తెలివిగా ప్రణాళికలు రచించిందని భారత వైమానిక దళ అధిపతి చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా ఆసక్తికర విషయాన్ని తెలిపారు. అయితే భారత వాయుసేన సామర్థ్యాలను మాత్రం అంచనా వేయలేక ఓటమి పాలైందని పేరొన్నారు. రిటైర్డ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ భరత్‌ కుమార్‌ రచించిన 'ది ఎపిక్‌ బ్యాటిల్ ఆఫ్‌ లొంగేవాలా' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆనాటి విషయాలు గుర్తు చేశారు.

Pak's plan was brilliant in 1971 War
ది ఎపిక్‌ బ్యాటిల్ ఆఫ్‌ లొంగేవాలా పుస్తకావిష్కరణ
author img

By

Published : Feb 18, 2021, 5:44 PM IST

యాభై ఏళ్ల క్రితం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో లొంగేవాలా ప్రాంతంలో మనల్ని ఓడించేందుకు దాయాది దేశం తెలివిగా ప్లాన్‌ చేసిందని భారత వైమానిక దళ అధిపతి చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా వెల్లడించారు. అయితే మన వాయుసేన శక్తిని పాక్‌ అంచనా వేయలేకపోయిందని తెలిపారు. రిటైర్డ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ భరత్‌ కుమార్‌ రచించిన 'ది ఎపిక్‌ బ్యాటిల్ ఆఫ్‌ లొంగేవాలా' పుస్తకాన్ని భదౌరియా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''లొంగేవాలా యుద్ధం గురించి చాలా చెప్పాలి. యుద్ధం కోసం ఎంచుకున్న ప్రాంతం, మార్గం విషయంలో పాకిస్థాన్‌ సైన్యం తెలివిగా ప్లాన్‌ రచించింది. ఆ పథకం ఫలించి ఉంటే పశ్చిమఫ్రంట్‌లో యుద్ధ ఫలితం మారిపోయి ఉండేది. కానీ అక్కడే పాకిస్థాన్‌ ఓ విషయాన్ని మర్చిపోయినట్లు ఉంది. భారత వాయుసేన శక్తిని అంచనా వేయలేకపోయింది. జైసల్మేర్‌లో హంటర్‌ యుద్ధవిమానాలతో ఉన్న సగం స్క్వాడ్రాన్‌ మమ్మల్ని ఏం చేయగలదులే అని అతివిశ్వాసంతో ఉంది. బహుశా వారు చేసిన పొరబాటు అదేనేమో'' అని భదౌరియా చెప్పుకొచ్చారు.

భారత వాయుసేన శక్తి సామర్థ్యాలేంటో లొంగేవాలా యుద్ధం నిరూపించిందని వాయుసేనాధిపతి అన్నారు. ఇలాంటి గొప్ప ఘటనలు పుస్తక రూపంలో తీసుకొచ్చి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.

బంగ్లాదేశ్‌ స్వతంత్ర పోరాటంలో భాగంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య 1971లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనే రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో ఉన్న లొంగేవాలా పోస్ట్‌పై పాకిస్థాన్‌ బలగాలు దాడి చేశాయి. దాదాపు 2000 నుంచి 3000 మంది పాక్‌ సైనికులు 30 - 40 యుద్ధ ట్యాంకులతో దండెత్తి వచ్చారు. భారత్‌ వైపు కేవలం 120 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. అయితే భారత వాయుసేనకు చెందిన 4 హంటర్‌ యుద్ధ విమానాలు భారత సేనకు అండగా రంగంలోకి దిగాయి. దీంతో భారత సైన్యం పైచేయి సాధించి యుద్ధంలో పాక్‌ను మట్టికరిపించింది.

ఇదీ చదవండి:పాక్ ఉగ్ర చర్యలపై విదేశీ రాయబారుల ఆరా

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.