విపక్ష కూటమిలోని వివిధ పార్టీల మధ్య రాష్ట్రస్థాయుల్లో విభేదాలు ఉన్నాయని, అయితే అవి అంత పెద్దవి కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. వాటిని పక్కనబెట్టి ప్రజల కోసం తాము పనిచేసేందుకు ముందుకు సాగుతామని ఖర్గే పేర్కొన్నారు. విపక్షాల సమావేశంలో భాగంగా మాట్లాడిన ఆయన.. తమ మధ్య భావజాల వైరుధ్యాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పదవిపై ఆసక్తి లేదని అన్నారు.
'మా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. బీజేపీకి 303 సీట్లు స్వయంగా రాలేదు. మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకొని వారిని దూరం పెట్టింది. ఇప్పుడేమో బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలు పాత స్నేహితులతో జతకట్టేందుకు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. కాంగ్రెస్కు అధికారం, ప్రధాని పదవిపై ఆసక్తి లేదు. అధికారం సంపాదించడం మా ఉద్దేశం కాదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించడమే మా లక్ష్యం' అని ఖర్గే వ్యాఖ్యానించారు.