Online Gaming Gambling Suicide : ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతిఒక్కరి చేతిలో కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్ద వారి వరకు సెల్‌ఫోన్స్ వాడుతున్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ.. అర్ధరాత్రి దాటినా మెలకువగా ఉంటూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. మరోవైపు కొందరు ఆన్‌లైన్ గేమ్స్ కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. తీరా ఆట మోజులో పడి సర్వం కోల్పోతున్నారు. దీంతో బాధిత కుటుంబాలను ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే నష్టపోయిన మరికొందరు ఆత్మహత్యలు చేసుకొని జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు.
Online Gaming Suicide in Yadadri Bhuvanagiri : ఆన్‌లైన్ గేమింగ్ తాజాగా ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. భర్త లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హాయిగా సాగుతున్న వారి కాపురంలో ఆన్‌లైన్ గేమ్ చిచ్చు రేపింది. భార్య ఆన్‌లైన్ గేమ్‌కు అలవాటుపడింది. ఇలా సంవత్సరం పాటు ఆడుతూ రూ.8లక్షలు పోగొట్టుకుంది. ఇందుకోసం పరిచయస్తులు.. బంధువుల దగ్గర అప్పు చేసింది. తీరా వారు అప్పు తీర్చమని అడిగినందుకు.. పిల్లలతో సహా సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
Online Games Spoils Life : చౌటుప్పల్ మల్లికార్జుననగర్‌లో మంగళవారం సాయంత్రం సంపులో దూకి తల్లి, ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేశ్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య రాజేశ్వరి(28), కుమారులు అనిరుధ్(5), హర్షవర్ధన్(3)లతో కలిసి కొన్నేళ్లుగా చౌటుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే రాజేశ్వరి సంవత్సర కాలంగా ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతూ రూ.8 లక్షలు పోగొట్టుకుంది. ఈ డబ్బంతా తెలిసిన వ్యక్తులు, బంధువులది.
Woman Committed Suicide along With her Children : ఈ నేపథ్యంలోనే తన అప్పు తీర్చమని దగ్గరి బంధువు ఒకరు మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి రాజేశ్వరిని నిలదీశారు. స్థలం విక్రయించి, బాకీ తీర్చుతామని నచ్చజెప్పినా ఆయన వినలేదు. కోపంతో రాజేశ్వరి భర్త మల్లేశ్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా వెళ్లిపోయారు. ఈ ఘటనను అవమానంగా భావించిన రాజేశ్వరి.. తన ఇద్దరు కుమారులను ఇంటి ఆవరణలో ఉన్న నీటిసంపులో వేసి, తానూ దూకేసింది.
రాత్రి ఏడు గంటల సమయంలో మల్లేశ్ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో భార్యాపిల్లలు కనిపించలేదు. మరోవైపు సంపు మూత తెరిచి ఉండటంతో అనుమానించి.. అందులోకి తొంగి చూశాడు. నీటిపై తేలియాడుతున్న తన కుటుంబాన్ని చూసి తల్లడిల్లాడు. వెంటనే ముగ్గురిని బయటికి తీసి చౌటుప్పల్ ప్రభుత్వఆసుపత్రికి తరలించాడు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి: