NTR centenary celebrations: జర్మనీలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ తెలుగు ప్రవాస భారతీయులు ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. మే 20వ తేదీన మినీ మహానాడు 2023 వేదికగా జయప్రదంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఈ వేడుక ద్వారా ఎన్టీఆర్ గొప్పదనాన్ని, తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
తెలుగు సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ సాధించిన గొప్ప విజయాలను ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేసుకున్నారు. ఈ వేడుకకు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్ జూమ్ మీటింగ్ ద్వారా హాజరయ్యి తమ సందేశాన్ని అందించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక అని వారివురు కొనియాడారు. తెలుగుదేశం జర్మనీ అధ్యక్షుడు పవన్ కుర్రా చొరవతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఎంతగానో ఆకట్టుకుంది.
మహానాడు కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఏడాది ఎన్నారై టీడీపీ జర్మనీ విభాగం చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. వారికి అనుబంధంగా విద్యార్థి విభాగం, మహిళా విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి తమ వంతు సహకారం ఉంటుంది అని ఈ వేడుకకు హాజరైన ఆహ్వానితుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
వేడుకకు హాజరైన తెలుగు వాళ్ల కోసం చక్కటి తెలుగు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి కళాకారిణి శ్రీమతి హరిప్రియ చేసిన నృత్యం, చిన్నారులు శాన్వి, అనన్య పాడిన తెలుగు పాటలు, చిన్నారి నిఖిత చేసిన నృత్యం అందరినీ అలరించాయి. ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మహానాడు కమిటీ సభ్యులైన పవన్, శివ, సుమంత్, నరేష్, వెంకట్, టిట్టు, అనిల్, వంశీ దాసరి, నీలిమ, అఖిల్, సాయి గోపాల్, రాంబాబు, వంశీ ఉండవల్లి, వంశీ నర్రా, మనోజ్, శ్రీ గణేష్‌లను అతిథులు అభినందించారు.
నెదర్లాండ్స్‌లో వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు: నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మే 21న జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ నగరాల నుంచి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ముందుగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు మురళీ మోహన్, ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ మరియు ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ ఆన్లైన్లో పాల్గొని ఎన్టీఆర్‌తో తమ జ్ఞాపకాలు పంచుకాని ప్రత్యక్షంగా పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమాన్ని నెదర్లాండ్స్ దేశంలోని ఎన్టీఆర్ అభిమాన సంఘం కార్యవర్గం సభ్యులు అయిన రామకృష్ణ ప్రసాద్, వివేక్ కరియావుల, వెంకట్ కోకా, తేజా గోయాల్లా, శ్యామ్ పంపానా, మధుకర్ రెడ్డి, సంపత్, ప్రసాద్, అమర్, నవీన్‌తో పాటు బెల్జియం నుంచి వచ్చిన ఇతర అభిమానులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా నిర్వహిచారు.
ఇవీ చదవండి: