Espionage Case: పాకిస్థాన్ ఏజెంట్ల గూఢచౌర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. గుజరాత్‌లోని గోద్రా, మహారాష్ట్రలోని బోల్దానా ప్రాంతాల్లోని అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు పలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కీలక సూత్రధారి యాకూబ్ గిటేలి, మగ్గురు ఏజెంట్లతో పాటు 11 మంది నేవీ అధికారులను అరెస్టు చేశారు. నౌకాదళానికి సంబంధించిన కీలక సమాచారం సేకరించేందుకు పాకిస్థాన్ ఏజెంట్లు గూఢచౌర్యానికి పాల్పడ్డారు.
ఐఎస్‌ఐ ఏజెంట్లు పలువురు యువనేవీ అధికారులను హనీట్రాప్ చేశారు. యువతిగా నమ్మించి నేవీ అధికారులతో ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకొని వాళ్ల కదలికలు తెలుసుకున్నారు. క్రమంగా నౌకలు, సబ్ మెరైన్లు, నేవీ ఉన్నతాధికారులకు చెందిన కొంత సమాచారం సేకరించారు. అనుమానం వచ్చిన ఏపీ కౌంటర్ ఇంటిలిజెన్స్, నేవీ ఇంటిలిజెన్స్, సెంట్రల్ ఇంటిలిజెన్స్ పోలీసులు డాల్ఫిన్స్ నోస్ పేరుతో దర్యాప్తు చేపట్టారు. గూఢచౌర్యం బయటపడటంతో 11 మంది యువ నేవీ అధికారులను, నలుగురు ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్టు చేశారు. ఈకేసులో ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు నేరాభియోగపత్రాలను దాఖలు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: బ్రహ్మోస్ రహస్యాలు లీకయ్యాయా?