భారత్, నెదర్లాండ్ వంటి ప్రజాస్వామ్య దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటే కొవిడ్ అనంతరం ఇరుదేశాలలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నెదర్లాండ్ ప్రధాన మంత్రి మార్క్ ర్యూట్తో జరిగిన వర్చువల్ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
వరుసగా నాలుగోసారి ప్రధాన మంత్రిగా ఎన్నికైనందుకు మార్క్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో నెదర్లాండ్‌లో ఉన్న భారతీయుల రక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
"వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, కరోనా తదితర సమస్యలపై ఇరు దేశాలు ఒకే దృక్పథంతో ఉన్నాయి. ఇండో-ఫసిఫిక్ లాంటి కఠినమైన అంశాల్లో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేయబోతున్నాయి. అంతేకాకుండా సముద్ర జలాల వ్యాపారం, రవాణా విషయంలో ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలు కొత్త పుంతలు తొక్కనున్నాయి."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని
కాప్26, భారత్-యూరోపియన్ యూనియన్ సమ్మిట్‌లో ఇరుదేశాలకు సంబంధించి కొత్త అవకాశాల గురించి చర్చిద్దామని అన్నారు.
"కొవిడ్ కష్టకాలంలోనూ డచ్ వ్యాపారులకు, పెట్టుబడిదారులకు అండగా నిలిచి వాణిజ్యాన్ని కొనసాగించినందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా ఎయిర్ బబుల్ ఒప్పందం కుదిరి.. తద్వారా భారత్‌లో ఉన్న తమ పౌరుల్ని, ఐరోపా పౌరుల్ని ఇక్కడికి పంపినందుకు, అలాగే నెదర్లాండ్‌లో ఉన్న భారత పౌరులు.. వారి స్వస్థలాలకు వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు."
-మార్క్ ర్యూట్, నెదర్లాండ్ ప్రధాని
ఇదీ చదవండి: ప్రిన్స్ ఫిలిప్‌కు మోదీ సహా ప్రపంచ నేతల నివాళి