నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయలేమని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. 2.09 లక్షల మంది విద్యార్ధులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారని తెలిపింది. ఈ సమయంలో పరీక్ష వాయిదా పడితే దగ్గర్లో మరో సరైన తేదీ అందుబాటులో ఉండకవచ్చని చెప్పింది. నీట్ పరీక్షను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లుపై సర్వోన్నత న్యాయస్థానం.. శుక్రవారం విచారణ చేపట్టింది.
నీట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని పొడిగించినందున ఆగస్టు 11 తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టుకు పిటిషనర్లు విన్నవించారు. నీట్ పరీక్ష వాయిదా వేసేటట్లు ఆదేశాలు ఇవ్వమని కోరారు. అయితే ఏఎస్జీ ఐశ్వర్య భాటి.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తరుపున కోర్టుకు హాజరయ్యారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది శంకర్నారాయణన్తో పాటు మరో న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు.
నీట్ పరీక్ష వాయిదా వేయాలని 13 మంది పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారని.. న్యాయవాది శంకరనారాయణన్ తెలిపారు. ఈ సమస్య దాదాపు 45వేల మంది అభ్యర్థులను ప్రభావితం చేస్తుందన్నారు. మార్చి 5న జరిగే పరీక్షకు, కౌన్సెలింగ్‌కు.. మధ్య ఐదు నెలలకు పైగా గ్యాప్ ఉంటుందని కోర్టుకు వివరించారు. రోజుకు 12 గంటల పాటు విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారన్నారని, వారికి పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం లేదని శంకరనారాయణన్ కోర్టుకు తెలిపారు.
ఇరువురి పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు బెంచ్.. ఈ పరీక్ష కోసం వేచి చూస్తున్న వారికి ఇదొక మానసిక హింసలాంటిదని అభిప్రాయపడింది. ఇప్పుడు మేము ఈ పరీక్షను వాయిదా వేస్తే.. అభ్యర్థులందరూ వేదనకు గురవుతారని తెలిపింది. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. పిటిషనర్లు లేవనెత్తిన సమస్యకు పరిష్కారం చూపాలని అదనపు సొలిసిటర్ జనరల్‌కు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది.