విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారని పోలీసుల్నే లాకప్‌లో బంధించారు జిల్లా సూపరిండెంటెంట్. వారు పనిచేస్తున్న స్టేషన్‌లోని సెల్లోనే రెండు గంటలపాటు నిలబెట్టారు. బిహార్ నవాదాలో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్పీ పనితీరును బిహార్ పోలీస్ అసోసియేషన్ తప్పుబట్టింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
అసలేం జరిగింది : డ్యూటీలో భాగంగా బిహార్‌లోని నవాదా పోలీస్ స్టేషన్‌కు గురువారం రాత్రి ఎస్పీ గౌరవ్ మంగళ వెళ్లారు. స్టేషన్లో ఉన్న సిబ్బందిని డైరీ అడిగారు. అందులో వివరాలేవీ అప్డేట్ చేసి లేవని ఆగ్రహించిన ఎస్పీ.. స్టేషన్లో ఉన్న సిబ్బందిపై అరిచారు. తర్వాత వారిని లాకప్‌లో పెట్టి బంధించారు. సొంత స్టేషన్లోనే నిందితుల్లా సెల్లో ఉండాల్సి రావడం వల్ల.. నవాదా నగర పోలీస్ స్టేషన్ సిబ్బంది ఖంగు తిన్నారు. కానీ.. అలా చేయమని ఎస్పీనే ఆదేశించినందున.. ఏమీ అనలేక మౌనంగానే ఉండిపోయారు. చివరకు రెండు గంటల తర్వాత బయటకు వచ్చారు. ఈ దృశ్యాలన్నీ పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఎస్పీ గౌరవ్ మంగళ తీరుపై బిహార్ పోలీస్ అసోసియేషన్ మండిపడింది. ఈ విషయాన్నిఇంతటితో వదిలేయాలాని నవాదా స్టేషన్ సిబ్బందిపై ఎస్పీ ఒత్తిడి చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు మృత్యుంజయ్ సింగ్ ఆరోపించారు. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫుటేజ్‌ను ఆధారంగా తీసుకుని గౌరవ్ మంగళపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: చెల్లి పెళ్లికి లీవ్ ఇవ్వలేదని ఆవేదన.. మతిస్తిమితం కోల్పోయి ఇంటికి దూరం.. మూడేళ్ల తర్వాత...
ఏడేళ్ల బాలికపై రేప్.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వృద్ధుడు