కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం వాటి ప్రభావాలు, భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఇన్‌ఫెక్షన్లను తెలుసుకునేందుకు జాతీయ స్థాయిలో వ్యాక్సిన్ ట్రాకింగ్ సిస్టమ్ రాబోతుంది. వ్యాక్సిన్ తొలి డోసు, పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత కలిగే ప్రభావాలను అంచనా వేసేందుకు ఈ నూతన వేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతి..
వ్యాక్సిన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) చేసిన సిఫార్సుకు జాతీయ నిపుణుల కమిటీతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతించిందని వ్యాక్సిన్ వర్కింగ్ గ్రూప్‌లోని సభ్యులు డాక్టర్ ఎన్‌కే అరోడా వెల్లడించారు. ముఖ్యంగా వ్యాక్సిన్ (కొవిషీల్డ్) డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచిన నేపథ్యంలో వీటి అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. క్షేత్ర స్థాయిలో వ్యాక్సిన్ ప్రభావాలను సమీక్షించేందుకు ఐసీఎంఆర్‌తో పాటు ఇతర సంస్థలకు ఈ సమాచారం ఎంతో దోహదపడుతుందని ఎన్టీఏజీఐ సిఫార్సు చేసిందన్నారు.
ఏదైనా ఎంచుకోవచ్చని..
వీటితోపాటు గర్భిణీలు, బాలింతలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లలో ఏదైనా ఎంచుకోవచ్చని ఎన్టీఏజీఐ సూచనలు చేసింది. అంతేకాకుండా ఎవరైనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత వైరస్ బారినపడితే.. అలాంటివారు కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాలని సూచించింది. ఇక ప్లాస్మా చికిత్స తీసుకున్న కొవిడ్ బాధితులు డిశ్చార్జి తర్వాత మూడు నెలల వరకు వ్యాక్సిన్‌ను వాయిదా వేసుకోవాలని ఎన్టీఏజీఐ సిఫార్సు చేసింది.
ఇదీ చూడండి: బ్లాక్ ఫంగస్‌పై హర్షవర్ధన్ కీలక సూచనలు
ఇదీ చూడండి: పిల్లలకు కరోనా టీకా ఎప్పుడు?