Haridwar Man Swachabharat Car: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా హరిద్వార్‌కు చెందిన ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం చూసి తన వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన కారునే చెత్తను తరలించే వాహనంగా మలిచి కొన్ని సంవత్సరాలుగా చెత్తను సేకరిస్తున్నాడు.
2012లో హరిద్వార్ పట్టణంలో.. వ్యర్థాల సేకరణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చెత్త విపరీతంగా పేరుకుపోయేది. ఆ పరిస్థితులను గమనించిన 53 ఏళ్ల నరేశ్ గిరి.. పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న మారుతీ-800 కారునే ఇందుకోసం ఉపయోగించాలనుకున్నాడు. కారులో వెనుక ఉండే రెండు సీట్లను తీసేశాడు. ఓ ప్లాస్టిక్ డ్రమ్మును సగానికి కట్ చేసి.. కారు సీట్ల స్థానంలో అమర్చాడు. కారుపైన జాతిపిత మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ ఫొటోలను కూడా పెట్టుకున్నాడు. ప్రతిరోజూ పట్టణమంతా తిరిగి చెత్త సేకరిస్తున్నాడు నరేశ్. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.
ఎలాంటి గుర్తింపు, పారితోషికాలు కోరుకోని నరేశ్.. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడమే తన ధ్యేయమని అంటున్నాడు. ."నాకు ఎలాంటి ఆర్థిక సహాయం లేదా అవార్డులు అవసరం లేదు. ఎవరైనా నాకు సహాయం చేయాలనుకుంటే, నిర్దేశించిన ప్రదేశంలో చెత్తను వేయండి చాలు. అదే నాకు మీరు చేసిన అతి పెద్ద సహాయం" అని నరేశ్ చెబుతున్నాడు. ఎలాంటి ప్రతిఫలం కోరుకోకుండా ఈ పనిచేస్తున్న నరేశ్‌ను.. హరిద్వార్ మేయర్ అనితా శర్మ అభినందించారు. త్వరలోనే అతడిని సన్మానిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: విమానాల్లో వచ్చి గొలుసులు చోరీ.. అంతా భార్య కోసమే!