Narendra Singh Tomar On Farm Laws: రద్దు చేసిన రైతు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర వ్యయసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో వెల్లడించారు. సాగుచట్టాలను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? అన్న ప్రశ్నకు తోమర్ అలా బదులిచ్చారు.
రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు పరిహారం ఇచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిందని అన్నారు తోమర్.
'ఫిబ్రవరి 8, 2022 వరకు 11.78 కోట్లమంది రైతులకు పీఎం- కిసాన్ పథకం కింద విడతల వారీగా రూ. 1.82లక్షల కోట్లు అందించాం. కొవిడ్-19 సంక్షోభంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వల్ల రూ. 3లక్షల కోట్లు వచ్చాయి. అంటే 2020-21జీడీపీలో 1.6శాతం' అని తోమర్ రాజ్యసభలో పేర్కొన్నారు.
గతేడాది నవంబర్ 19న జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులను ఒప్పించడంలో విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: 'అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనీస మద్దతు ధరపై కమిటీ'