గుజరాత్ రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఓటు వేయడానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తన అన్న సోమభాయ్ మోదీని కలిశారు. తొలుత అహ్మదాబాద్ రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మోదీ.. సమీపంలో ఉన్న సోదరుడి నివాసానికి వెళ్లారు. సోదరుడు నరేంద్ర మోదీతో మాట్లాడిన సోమభాయ్ మోదీ భావోగ్వేదానికి గురయ్యారు. దేశం కోసం ఆయన(ప్రధానమంత్రి నరేంద్ర మోదీ) చాలా కష్టపడి పనిచేశారని.. కొంత విశ్రాంతి తీసుకోవాలని తాను సూచించానని సోమభాయ్ మోదీ తెలిపారు. దేశాభివృద్ధికి పాటుపడిన పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. 2014 తర్వాత దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఓటు వేసిన పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేశారు సోమభాయ్ మోదీ.
వీల్‌ఛైర్‌పై వచ్చి ఓటేసిన ప్రధాని మోదీ తల్లి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లోని రాయ్సన్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు. అంతకుముందు ఆదివారం గాంధీనగర్‌లోని తన తల్లి నివాసానికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు ప్రధాని మోదీ. అనంతరం తల్లి ఇచ్చిన టీ సేవించి ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో ప్రధాని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
నడుచుకుంటూ వెళ్లి.. క్యూలో నిల్చుని ఓటేసిన మోదీ
అంతకుముందు అహ్మదాబాద్ పరిధిలో ఉన్న రాణిప్ నిషాన్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్రగా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సాధారణ ఓటర్లలాగే వరుసలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధాని. అనంతరం మాట్లాడిన మోదీ.. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించారంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యంగా యువత, మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసేందుకు ఉదయాన్నే వచ్చామని స్థానికులు చెప్పారు. మోదీని చూస్తే గర్వంగా ఉంటుందని.. మొదట మోదీని చూసిన తర్వాతే ఓటు వేశామని తెలిపారు.
ఇవీ చదవండి: ఓటేసిన ప్రధాని మోదీ.. నడుచుకుంటూ వెళ్లి, క్యూలో నిల్చుని..
గుజరాత్లో రెండో దశ పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని, సీఎం, షా