భాజపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టాల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై పార్టీ కిసాన్ విభాగంతో కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘం నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటు ఆ పార్టీ నేతలు భూపేంద్ర యాదవ్, సంజీవ్ బాల్యన్ పాల్గొన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సంఘం నాయకులు ఈ రాష్ట్రాల్లో మహాపంచాయతీల పేరట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఖాప్ పంచాయతీలు (కుల సంఘాలు) మహాపంచాయతీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీకి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పాల్గొన్నట్లు వెల్లడించాయి.
ఇదీ చూడండి: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తొలగింపు