accused released after 28 years: దేశ న్యాయవ్యవస్థలో లోపం, పోలీసు వైఫల్యాన్ని ఎత్తిచూపే ఘటన బిహార్ గోపాల్‌గంజ్‌లో జరిగింది. యువకుడిగా ఉన్నప్పుడు జైలుకెళ్లిన నిందితుడు.. తన జీవితంలో విలువైన సమయాన్ని కారాగారంలోనే గడపాల్సి వచ్చింది. హత్య ఆరోపణలపై కటకటాల వెనక బందీగా జీవితం గడిపిన బీర్బల్ భగత్ అనే వ్యక్తిని.. 28 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం. అతడు దోషి అని నిరూపించేలా పోలీసులు తగిన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయారు. అమాయకుడని తేలగానే కోర్టులోనే విలపించాడు బీర్బల్.
అసలేమైందంటే..?: ఈ కేసు 1993లో మొదలైంది. ఆ ఏడాది జూన్ 11న.. బిహార్ గోపాల్‌గంజ్ జిల్లాలోని భోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే సూర్యనారాయణ్ భగత్ అనే వ్యక్తి.. ఉత్తర్‌ప్రదేశ్ దేవరియాకు చెందిన బీర్బల్ భగత్‌తో కలిసి ముజఫర్‌పుర్‌కు పని కోసం వెళ్లాడు. ఈ క్రమంలోనే సూర్యనారాయణ్ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులంతా వెతికినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 1993 జూన్ 28న సూర్యనారాయణ్ కుమారుడు సత్యనారాయణ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్లో బీర్బల్ భగత్ పేరును కూడా చేర్చాడు. తన తండ్రితో పాటు బీర్బల్ కూడా వెళ్లాడని, అందుకే మిస్సింగ్ కేసులో అతడి ప్రమేయం ఉంటుందని అనుమానించాడు.
UP Murder accused released: అనంతరం కొద్దిరోజులకు గుర్తు తెలియని ఓ శవాన్ని దేవరియా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరియా పోలీసులు పంపిన ఫొటోలను గోపాల్‌గంజ్‌లో ఉంటున్న సూర్యనారాయణ్ కుటుంబ సభ్యులు పరిశీలించారు. ఆ మృతదేహం సూర్యనారాయణ్దేనని ధ్రువీకరించారు. దీంతో మిస్సింగ్ కేసు కాస్తా.. మర్డర్ కేసుగా మారింది. 1994 నుంచి జైలు జీవితం అనుభవిస్తున్న బీర్బల్.. ఒక్కరోజు కూడా బెయిల్‌పై బయటకు రాలేదు. 1995 ఫిబ్రవరి 28న ఈ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ నమోదు చేశారు. అయితే, కోర్టులో ఈ విచారణ నత్తనడకన సాగింది. 'నిజానికి ఈ కేసు విచారణ వేగంగా జరగాల్సింది. తొలుత ఫాస్ట్‌ట్రాక్ కోర్టులోనే ఈ కేసు విచారణ సాగింది. కానీ, మధ్యలో కొన్నేళ్ల పాటు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను మూసివేయడం వల్ల.. విచారణ ఆలస్యమైంది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి వద్దకు ఈ కేసు రాగానే.. వేగం పుంజుకుంది' అని డిఫెన్స్ న్యాయవాది రాఘవేంద్ర సిన్హా పేర్కొన్నారు.
కేసుపై విచారణ జరిపిన బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు.. బీర్బల్‌ను స్థానిక పోలీసుల రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు సమర్పించలేదు. వాంగ్మూలం ఇచ్చేందుకు ఒక్కరూ రాలేదు. శవానికి వైద్యపరీక్షలు చేసిన డాక్టర్ జాడ కూడా లేదు. మృతదేహానికి సంబంధించిన పాత చిత్రాలు సైతం సరిగా లేవు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి విశ్వవిభూతి గుప్తా ఈ మేరకు నిందితుడిని నిర్దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పారు.
ఇదీ చదవండి: