Girls Drowned in Chambal River: మధ్యప్రదేశ్ మురేనా జిల్లా సబల్‌గఢ్ తహసీల్దార్ ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. చంబల్ నది రాహుఘాట్ వద్ద స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు బాలికలు నీటిలో మునిగిపోయారు. లోతైన ప్రాంతానికి వెళ్లిన వారు.. ఒకరి తర్వాత మరొకరు నదిలో చిక్కుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో బాలిక మృతదేహం కోసం గాలిస్తుండగా చీకటి పడటం వల్ల వెతకడం ఆపేశారు. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం వల్ల వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది.
రెమ్జాపురా గ్రామంలో నివసించే కేవట్ కుటుంబానికి చెందిన అనసూయ(12), సుహాని(13), సాధన(12)తో పాటు వీరి సోదరుడు చంద్రభాన్ శుక్రవారం సాయంత్రం చంబల్ నదికి వెళ్లారు. స్నానం చేసేందుకు వెళ్లి లోతైన ప్రాంతంలో దిగారు. ఈత రాకపోవడం వల్ల మునిగిపోయారు. గంట తర్వాత అటు వైపు వచ్చిన ఓ యువకుడికి ఇద్దరి బాలికల మృతేదేహాలు తేలియాడుతూ కన్పించాయి. వెంటనే అతను గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. దీంతో జనం భారీగా తరలివచ్చారు. గజ ఈతగాళ్లు నదిలోకి దూకి ఇద్దరు బాలికల మృతేహాలను బయటకు తీశారు. మరో బాలిక సాధన మృతదేహం లభించలేదు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మరణించడం వారి ఇళ్లతో విషాద ఛాయలు అలముకునేలా చేసింది. వీళ్ల ఇంట్లో కొద్ది రోజుల్లోనే రెండు వివాహ వేడుకలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో చిన్నారులు మరణించడం కుటుంబసభ్యులను దుఃఖంలోకి నెట్టింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో పెను విషాదంతో గ్రామస్థులు కూడా చలించిపోయారు. వారిని ఓదార్చేందుకు పెద్ద సంఖ్యలో వెళ్లారు.
ఇదీ చదవండి: ప్రికాషన్ డోసు కాల వ్యవధిపై కేంద్రం క్లారిటీ