కరోనాకు వ్యతిరేకంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అన్ని సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. కరోనా పోరులో అనుభవం, ఉత్తమ వనరులు ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్ సైతం అందుబాటులోకి వచ్చిందన్నారు.
వైరస్ రెండో దశ వ్యాప్తిని అడ్డుకోవాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాలు తొలి దశ తీవ్రస్థాయిని దాటేశాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు కరోనా కట్టడిలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయని అన్నారు.
భారత్‌లో మాత్రమే కొవిడ్ టీకాలు సమృద్ధిగా లభ్యమవుతున్నాయని మోదీ అన్నారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
'టెస్టులు పెరగాలి'
కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని మోదీ సూచించారు. టెస్టుల్లో 70 శాతం ఆర్టీ పీసీఆర్ పరీక్షలు ఉండాలనేదే మన లక్ష్యమని చెప్పారు. వైరస్ కేసులు అధికంగా వచ్చినప్పటికీ.. పరీక్షల సంఖ్య తగ్గకూడదని అన్నారు.
మైక్రో కంటైన్మెంట్ జోన్లపై దృష్టిసారించాలని చెప్పారు. రాత్రి కర్ఫ్యూలను కరోనా కర్ఫ్యూలుగా పిలవాలని సూచించారు.